కస్తూర్బా స్కూళ్ల సమస్యలను పరిష్కరించాలె

కస్తూర్బా స్కూళ్ల సమస్యలను పరిష్కరించాలె

హైదరాబాద్: రాష్ట్రంలోని కస్తూర్బా పాఠశాలల సమస్యలపై బీసీ విద్యార్థి సంఘం నేతలు  తాటికొండ విక్రం గౌడ్,  కుల్కచర్ల శ్రీనివాస్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కి ఫిర్యాదు చేశారు. కస్తూర్బా స్కూళ్లలో  చదువుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల చనిపోతున్నారని చెప్పారు. కస్తూర్బా పాఠశాలల్లో  వేల సంఖ్యలో విద్యార్థులు చదువుతున్నారని, వారంతా సరైన వసతులు లేక ఇబ్బందిపడుతున్నారని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. హాస్టళ్లలో సరైన పోషకాహారం, సురక్షిత మంచి నీరు అందించడం లేదని తెలిపారు. రోగమొస్తే కనీసం ప్రాథమిక చికిత్స అందించడానికి నర్సులు, డాక్టర్లు లేరని కంప్లైంట్ చేశారు.

సొంత భవనాలు లేక ఊరి చివరన ఉన్న అద్దె భవనాల్లో పాఠశాలలను ఏర్పాటు చేశారని, దీంతో పాములు, తేళ్ల బారిన పడి విద్యార్థులు చనిపోతున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగం ప్రకారం పేద వర్గాలకు ఉచితంగా దక్కాల్సిన విద్యా హక్కును రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని తెలిపారు. విద్యార్థుల హక్కులను కాలరాస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్ పై చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని హెచ్చార్సీని బీసీ విద్యార్థి సంఘం నేతలు కోరారు.