మిలియన్ మార్చ్ తరహాలో 25న కుల గణన మార్చ్ : జాజుల శ్రీనివాస్ గౌడ్

మిలియన్ మార్చ్ తరహాలో 25న కుల గణన మార్చ్ : జాజుల శ్రీనివాస్ గౌడ్
  • పోస్టర్​ను ఆవిష్కరించిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల

ఖైరతాబాద్, వెలుగు: మిలియన్ మార్చ్ తరహాలో ఈ నెల 25న లక్ష మందితో హైదరాబాద్ లో కుల గణన మార్చ్ చేపట్టనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో కుల గణన మార్చ్ పోస్టర్ ను జాజుల ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

కులగణన కోసం మార్చి 15న రాష్ట్ర ప్రభుత్వం జీవో 26 విడుదల చేసిందని తెలిపారు. అప్పటి నుంచి కుల గణనపై ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతుందని తెలిసి కోర్టులో పిటిషన్ వేశానని చెప్పారు. పిటిషన్ ను పరిశీలించిన న్యాయస్థానం మూడు నెలల్లో కుల గణన చేపట్టి ఆ తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు.

ఎన్నికలకు ముందు బీసీల సమగ్ర కుల గణన చేపడుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకున్నదని ఆ తర్వాత వక్రబుద్ధి చూపిందని ఆయన మండిపడ్డారు. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఇప్పటి వరకు కుల గణనపై ఒక్క అడుగు కూడా ప్రభుత్వం ముందుకు వేయకపోవడంతోనే కుల గణన మార్చ్ కు పిలుపునిచ్చినట్టు వివరించారు.