
- నంబాల కేశవరావు పుట్టింది శ్రీకాకుళంలో..చదువుకుంది వరంగల్ ఆర్ఈసీలో
- నాలుగున్నర దశాబ్దాలు అజ్ఞాతంలోనే
- గెరిల్లా యుద్ధతంత్రంలో నేర్పరి
- అలిపిరి దాడి, మహేంద్రఖర్మ హత్య కేసుల్లో కీలక పాత్ర
భద్రాచలం / హనుమకొండ / కరీంనగర్, వెలుగు: ఎంటెక్ మధ్యలో ఆపేసి ఉద్యమ బాట పట్టారు నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు. దాదాపు నాలుగున్నర దశాబ్దాలు అదే దారిలో కొనసాగారు. బుధవారం ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు.
- కేశవరావు ఏపీలోని శ్రీకాకుళం జిల్లా జియన్నపేట గ్రామంలో 1955లో జన్మించారు. 1970 నుంచి వామపక్ష రాజకీయాల వైపు నడిచారు.
- వరంగల్‌లోని రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీ (ఆర్ఈసీ)లో బీటెక్ చదివారు. రాడికల్స్ స్టూడెంట్ యూనియన్‌లో పనిచేశారు. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన ఘర్షణల్లో తొలిసారి అరెస్ట్ అయ్యారు. కబడ్డీ ఆటగాడిగా కూడా ఆయనకు పేరుంది. ఎంటెక్ చదువుతూనే 1980లో పీపుల్స్ వార్‌కు ఆకర్షితులయ్యారు. అదే సమయంలో సీపీఐ (ఎంఎల్) నాయకుడు, పీపుల్స్ వార్ పార్టీ సారథి కొండపల్లి సీతారామయ్య, మరో నాయకుడు కేజీ సత్యమూర్తి సెయింట్ గ్యాబ్రియల్ స్కూల్ లో టీచర్లు గా పని చేస్తూ ఆర్ఈ సీ విద్యార్థులతో టచ్ లో ఉండేవారు. విద్యార్థి ఉద్యమాల్లో గైడ్ చేసేవారు. వారి ప్రభావంతో కేశవరావు పీపుల్స్ వార్ పార్టీలో క్రియాశీలకంగా మారారు.
- గెరిల్లా యుద్ధ తంత్రంలో కేశవరావు నేర్పరి. తూర్పుగోదావరి , విశాఖ జిల్లాల్లో పనిచేసిన తొలి కమాండర్‌గా రికార్డ్ సాధించారు. మల్లోజుల కోటేశ్వరరావు, మల్లోజుల వేణుగోపాల్, మల్లా రాజిరెడ్డితో కలిసి దాడులకు వ్యూహరచన చేసేవారు. మావోయిస్టు పార్టీలో మిలటరీ కమిషన్‌ను ఏర్పాటు చేసింది కేశవరావే. ఆయనే మిలటరీ కమిషన్ చీఫ్‌గా పని చేశారు.
- చత్తీస్‌గఢ్ దండకారణ్యాన్ని కేంద్రంగా చేసుకుని విప్లవకారిడార్ను నేపాల్ వరకు విస్తరించిన నాయకత్వంలో కేశవరావు కీలకపాత్ర పోషించారు. దూకుడుగా పోరాటం చేయడంలో మావోయిస్టులకు ట్రైనింగ్ ఇచ్చేవారు. ఆకస్మిక దాడులు, పేలుడు పదార్థాల వాడకంపై 1987లో బస్తర్ అడవుల్లో ఎల్టీటీఈ ( లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం) ఇచ్చిన ట్రైనింగ్‌లో పార్టీ కీలక నేతలతో కలిసి ఆయన పాల్గొన్నారు.
- 2018లో మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో కేశవరావు పార్టీ కార్యదర్శిగా అదే సంవత్సరం నవంబర్ 10న బాధ్యతలు చేపట్టారు.
ఎమర్జెన్సీ టైమ్‌లో హమాలీగా..
ఎమర్జెన్సీ టైమ్‌లో విప్లవకారులందరి మీద నిర్బంధం పెరగడంతో నంబాల కేశవరావు అజ్ఞాత జీవితాన్ని ఎంచుకున్నారు. వరంగల్ లోనే అజ్ఞాత జీవితం గడిపిన కాలంలో వరంగల్ హమాలీలను ఆర్గనైజ్ చేయడానికి ఆయన కొన్ని నెలల పాటు హమాలీగా పనిచేశారు. 1980లో రెడ్ కారిడార్ నిర్మాణం లో భాగంగా అడవిలోకి దళాలను పంపాలని పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు తూర్పు గోదావరి జిల్లాకు పంపిన మొదటి దళానికి కమాండర్ గా గంగన్న పేరుతో వెళ్లారు.
బలగాల చేతిలో చనిపోయిన రెండో జనరల్ సెక్రటరీ
నక్సల్బరీ ఉద్యమ నిర్మాత, సీపీఐ(ఎంఎల్) కేంద్ర కమిటీ కార్యదర్శి చారు మజుందార్ 1972 లో పశ్చిమ బెంగాల్‌లోని లాల్ బజార్ బలగాలు, పోలీసులకు చిక్కి అదే ఏడాది జులై 28న పోలీస్ నిర్బంధంలోనే ప్రాణాలు వదిలారు. చారుమజుందార్ తర్వాత బలగాలు, పోలీసుల చేతిలో చనిపోయిన మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావే.
గెరిల్లా ఆర్మీ సారథిగా..!
1999 డిసెంబర్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొయ్యూరులో జరిగిన ఎన్కౌంటర్ లో చనిపోయిన పీపుల్స్ వార్ అగ్రనేతలు నల్లా ఆది రెడ్డి, ఎర్రంరెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేష్‌కు గుర్తుగా మరుసటి ఏడాది 2000 డిసెంబ ర్ లో ఏర్పాటు చేసిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ(పీఎల్జీఏ)కి కేశవరావు సారథిగా వ్యవ హరించారు. ఒకప్పుడు పది, 12 మంది ఉండే దళాలను తర్వాత ప్లాటూన్లుగా, కంపెనీలుగా, బెటాలియన్లుగా విస్తరించారు. 2004లో మిలటరీ కమిషన్‌కు చీఫ్‌గా వ్యవహరించారు.
హిడ్మాకు గురువు
పోలీసులపై మావోయిస్ట్ పార్టీ చేసిన అనేక దాడులకు నాయకత్వం వహిం చిన హిడ్మాకు గెరిల్లా శిక్షణ ఇచ్చింది నంబాల కేశవరావేనని ప్రచారంలో ఉంది. హిడ్మా నాయకత్వంలో 2010 ఏప్రిల్ 10న దంతెవాడ జిల్లా తాడిమెట్ట దగ్గర జరిపిన దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చనిపోయారు. ఈ దాడికి మాస్టర్ మైండ్ కేశవరావని ఎన్ఐఏ రికార్డులు వెల్లడిస్తున్నాయి.
ఎన్నో సంచలన కేసుల్లో..
చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, ఒడిశాలో జరిగిన పలు దాడుల్లో నంబాల కేశవరావు కీలకంగా వ్యవహరించారు. 2003లో నాటి ఉమ్మడి ఏపీ సీఎం చంద్రబాబుపై తిరుమలలోని అలిపిరి వద్ద జరిగిన దాడికి ఆయనే నాయకత్వం వహించినట్లు ఆరోపణలు ఉన్నాయి. విశాఖ జిల్లాలో కిడారి సర్వేశ్వరరావు హత్య, తాడిమెట్లలో 76 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల హత్య, సీలేరు నదిలో లాంచీపై దాడి చేసి గ్రేహౌండ్స్ బలగాలను చంపేసిన ఘటనలో కేశవరావు హస్తం ఉందని పోలీసులు చెప్తున్నారు.
జీరంఘాట్లో 2013లో సల్వాజుడుం వ్యవస్థాపకుడు మహేంద్రఖర్మపై దాడికి వ్యూహం కూడా కేశవరావుదేనని అంటున్నారు. ఈ ఘటనలో మహేంద్ర ఖర్మతోపాటు 27 మంది కాంగ్రెస్ నేతలు చనిపోయారు. ఒడిశాలోని నయాగఢ్ జిల్లా కేంద్రంలో ఆయుధాగారంపై 2008 ఫిబ్రవరి 15న పీఎల్ జీ ఏ దాడి చేసిన ఘటనలో కేశవరావు సూత్రధారిగా, సారథిగా వ్యవహరించారు. ఈ దాడిలో వెయ్యికి పైగా ఆధునిక ఆయుధాలను మావోయిస్టులు స్వాధీనం చేసుకున్నారు. కేశవరావుపై రూ.1.50 కోట్ల రివార్డు ఉంది.