MIvsDC: 11వ సారి ప్లే ఆఫ్స్‌‌‌‌లోకి ముంబై.. ఢిల్లీపై ఎలా గెలిచిందంటే..

MIvsDC: 11వ సారి ప్లే ఆఫ్స్‌‌‌‌లోకి ముంబై.. ఢిల్లీపై ఎలా గెలిచిందంటే..

ముంబై: ప్లే ఆఫ్స్‌‌‌‌ చేరాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌‌‌‌లో ముంబై ఇండియన్స్‌‌‌‌ దుమ్మురేపింది. బ్యాటింగ్‌‌‌‌లో సూర్యకుమార్‌‌‌‌ యాదవ్‌‌‌‌ (43 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 4 సిక్స్‌‌‌‌లతో 73 నాటౌట్‌‌‌‌), నమన్‌‌‌‌ ధీర్‌‌‌‌ (8 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 2 సిక్స్‌‌‌‌లతో 24 నాటౌట్) సూపర్ పెర్ఫామెన్స్‌‌‌‌కు తోడు బుమ్రా (3/12), మిచెల్‌‌‌‌ సాంట్నర్‌‌‌‌ (3/11) బౌలింగ్‌‌‌‌లో చెలరేగడంతో.. బుధవారం జరిగిన కీలక లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ముంబై 59 రన్స్‌‌‌‌ తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌పై గెలిచి 11వ సారి ప్లే ఆఫ్స్‌‌‌‌లోకి ప్రవేశించింది. 

టాస్‌‌‌‌ ఓడిన ముంబై 20 ఓవర్లలో 180/5 స్కోరు చేసింది. తిలక్‌‌‌‌ వర్మ (27), రికెల్టన్‌‌‌‌ (25), విల్‌‌‌‌ జాక్స్‌‌‌‌ (21) ఫర్వాలేదనిపించారు. తర్వాత ఢిల్లీ 18.2 ఓవర్లలో 121 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. సమీర్ రిజ్వి (39) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. సూర్యకు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది.

సూర్య ప్రతాపం..
ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ముంబైని ఆరంభంలో అద్భుతంగా కట్టడి చేసిన డీసీ బౌలర్లు చివర్లో భారీగా రన్స్‌‌‌‌ ఇచ్చుకున్నారు. ఫోర్‌‌‌‌తో ఖాతా తెరిచిన రోహిత్‌‌‌‌ (5)ను మూడో ఓవర్‌‌‌‌లో ముస్తాఫిజుర్‌‌‌‌ (1/30) వెనక్కి పంపగా, రెండో ఓవర్‌‌‌‌లో రికెల్టన్‌‌‌‌ వరుస సిక్స్‌‌‌‌లతో టచ్‌‌‌‌లోకి వచ్చాడు. నాలుగో ఓవర్‌‌‌‌లో రెండు ఫోర్లు కొట్టిన విల్‌‌‌‌ జాక్స్‌‌‌‌ తర్వాతి ఓవర్‌‌‌‌లో 6, 4తో రెచ్చిపోయాడు. కానీ ఆరో ఓవర్‌‌‌‌లో ముకేశ్‌‌‌‌ కుమార్‌‌‌‌ (2/48)కు వికెట్‌‌‌‌ ఇచ్చాడు. ఈ దశలో వచ్చిన సూర్యకుమార్‌‌‌‌ మెరుపు ఇన్నింగ్స్‌‌‌‌తో కీలక భాగస్వామ్యాలు అందించాడు. పవర్‌‌‌‌ప్లేలో 64/2 స్కోరు చేసిన ముంబై ఏడో ఓవర్‌‌‌‌లో రికెల్టన్‌‌‌‌ వికెట్‌‌‌‌ కోల్పోవడంతో స్కోరు 58/3గా మారింది.

తిలక్‌‌‌‌ వర్మ స్ట్రయిక్‌‌‌‌ రొటేట్‌‌‌‌ చేయడంతో ఫస్ట్‌‌‌‌ టెన్‌‌‌‌లో ముంబై 80/3 స్కోరు చేసింది. 11వ ఓవర్‌‌‌‌లో సిక్స్‌‌‌‌తో జోరు పెంచిన తిలక్‌‌‌‌ చకచకా సింగిల్స్‌‌‌‌తో రన్‌‌‌‌రేట్‌‌‌‌ పెంచే ప్రయత్నం చేశాడు. ఆ వెంటనే సూర్య 6, 4 బాదినా 15వ ఓవర్‌‌‌‌లో తిలక్‌‌‌‌ ఔట్‌‌‌‌తో నాలుగో వికెట్‌‌‌‌కు 55 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ ముగిసింది. 9 బాల్స్‌‌‌‌ తర్వాత హార్దిక్‌‌‌‌ పాండ్యా (3) కూడా వెనుదిరగడంతో స్కోరు 123/5గా మారింది. ఇక నమన్‌‌‌‌ ధీర్‌‌‌‌ రాకతో ఆట స్వభావమే మారిపోయింది. ఆరంభంలో ధీర్‌‌‌‌ మెల్లగా ఆడటంతో స్కోరు 18వ ఓవర్లలో 132/5గానే ఉంది. కానీ చివరి రెండు ఓవర్లలో సూర్య 6, 4, 6, 6, 4..  నమన్‌‌‌‌ 4, 6, 6, 4తో 48 రన్స్‌‌‌‌ దంచారు. ఆరో వికెట్‌‌‌‌కు 57 రన్స్‌‌‌‌ జోడించడంతో  మంచి టార్గెట్‌‌‌‌ వచ్చింది. చమీరా, కుల్దీప్‌‌‌‌ చెరో వికెట్‌‌‌‌ తీశారు. 

బుమ్రా, సాంట్నర్‌‌‌‌ షో..
ఛేజింగ్‌‌‌‌లో ఢిల్లీ బ్యాటర్లు బొక్కబోర్లా పడ్డారు. బుమ్రా, సాంట్నర్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ను ఎదుర్కోలేక వరుస విరామాల్లో పెవిలియన్‌‌‌‌కు చేరారు. రెండో ఓవర్‌‌‌‌లోనే డుప్లెసిస్‌‌‌‌ (6)తో మొదలైన వికెట్ల పతనం వేగంగా సాగింది. మరో ఆరు బాల్స్‌‌‌‌ తర్వాత కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ (11), పది బాల్స్‌‌‌‌ తర్వాత అభిషేక్‌‌‌‌ పోరెల్‌‌‌‌ (6) ఔట్‌‌‌‌ కావడంతో ఢిల్లీ 27/3తో ఎదురీత మొదలుపెట్టింది. ఈ దశలో సమీర్‌‌‌‌ రిజ్వి, విప్రజ్‌‌‌‌ నిగమ్‌‌‌‌ (20) మెల్లగా ఆడటంతో 49/3తో పవర్‌‌‌‌ప్లేను ముగించింది. ఫీల్డింగ్‌‌‌‌ విస్తరించిన తర్వాత ముంబై బౌలర్లు మరింత కట్టుదిట్టంగా బౌలింగ్‌‌‌‌ చేశారు.

ఎనిమిదో ఓవర్‌‌‌‌లో సాంట్నర్‌‌‌‌.. నిగమ్‌‌‌‌ను వెనక్కి పంపడంతో నాలుగో వికెట్‌‌‌‌కు 28 రన్స్‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. 10వ  ఓవర్‌‌‌‌లో ట్రిస్టాన్‌‌‌‌ స్టబ్స్‌‌‌‌ (2)ను బుమ్రా దెబ్బకొట్టడంతో 65 రన్స్‌‌‌‌కు సగం జట్టు వెనక్కి వచ్చేసింది. 15వ ఓవర్‌‌‌‌లో సాంట్నర్‌‌‌‌ నాలుగు బాల్స్‌‌‌‌ తేడాలో సమీర్‌‌‌‌, అశుతోష్‌‌‌‌ శర్మ (18)ను ఔట్‌‌‌‌ చేసి డబుల్‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌ ఇచ్చాడు. 16, 19వ ఓవర్లలో బుమ్రా.. మాధవ్‌‌‌‌ తివారి (3), ముస్తాఫిజుర్‌‌‌‌ (0)ను ఔట్‌‌‌‌ చేస్తే, మధ్యలో కుల్దీప్‌‌‌‌ (7)ను కర్న్‌‌‌‌ శర్మ (1/31) బోల్తా కొట్టించడంతో ఢిల్లీ టార్గెట్‌‌‌‌ను అందుకోలేకపోయింది.

సంక్షిప్త స్కోర్లు
ముంబై: 20 ఓవర్లలో 180/5 (సూర్య 73*, నమన్‌‌‌‌ ధీర్‌‌‌‌ 24*, ముకేశ్‌‌‌‌ 2/48). ఢిల్లీ: 18.2 ఓవర్లలో 121 ఆలౌట్‌‌‌‌ (సమీర్‌‌‌‌ 39, నిగమ్‌‌‌‌ 20, బుమ్రా 3/12, సాంట్నర్‌‌‌‌ 3/11).