ఫీజు రీయింబర్స్మెంట్ ఉద్యమం ఉధృతం చేస్తాం : జాజుల శ్రీనివాస్ గౌడ్

ఫీజు రీయింబర్స్మెంట్ ఉద్యమం ఉధృతం చేస్తాం : జాజుల శ్రీనివాస్ గౌడ్
  •     బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్

హైదరాబాద్ ,వెలుగు :  ఫీజు రీయింబర్స్​మెంట్​ రద్దుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం హైదరాబాద్‌‌లోని బర్కత్‌‌పుర చౌరస్తాలో విద్యార్థుల ఆందోళనలో బీఆర్ఎస్ శాసనసభ పక్ష నేత మధుసూదనాచారితో కలిసి ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఫీజు రీయింబర్స్​మెంట్​ కేసులో ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ అఫిడవిట్ వేయకపోవడంతోనే విద్యార్థుల వద్ద నుంచి ఫీజులు వసూలు చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు.  

పేద విద్యార్థుల ఫీజు బకాయిల కోసం కనీసం రూ.7 వేల కోట్లు విడుదల చేయకుండా ప్రభుత్వం చదువులను అడ్డుకుంటోందని మండిపడ్డారు. రాష్ట్రంలో 14 లక్షల బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పేద విద్యార్థుల భవిష్యత్తును కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తోందని విమర్శించారు. ఈ విషయంలో నోరు మెదపని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మంత్రులు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై ఈ నెల 15న వేలాది మందితో “చలో హైదరాబాద్” నిర్వహిస్తామని తెలిపారు.