ముంబై: భారత జాతీయ పురుషుల క్రికెట్ జట్టు స్పిన్ బౌలింగ్ కోచ్‌గా మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే మంగళవారం నియమితులయ్యారు. ఈమేరకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారిక ప్రకటన విడుదల చేసింది. భారత్ తరపున 2 టెస్టులు, 8 వన్డేలు ఆడిన బహుతులే ఇటీవల ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టుకు పనిచేశారు.
దేశవాళీ క్రికెట్ దిగ్గజమైన 53 ఏళ్ల బహుతులేకు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 630 వికెట్లు, 6,176 పరుగుల అద్భుత రికార్డు ఉంది. రిటైర్మెంట్ తర్వాత విదర్భ, కేరళ, గుజరాత్, బెంగాల్ జట్లకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించారు. ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్, పంజాబ్ కింగ్స్ జట్లకు స్పిన్ కోచ్‌గా సేవలందించారు. 2021–24 మధ్య కాలంలో నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ) లోనూ పనిచేశారు.
2022 లో అండర్-19 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు ఆయనే బౌలింగ్ కోచ్. ఈ నియామకంపై బహుతులే స్పందిస్తూ.. భారత జట్టుకు కోచ్‌గా సేవలందించే అవకాశం రావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. జూన్ 6 నుంచి ముల్లాన్‌పూర్‌లో అఫ్గానిస్తాన్‌తో జరగబోయే ఏకైక టెస్ట్ మ్యాచ్ ఆయనకు మొదటి అసైన్‌మెంట్ కానుంది. ఈ మ్యాచ్‌లో మానవ్ సుతార్, హర్ష్ దూబే వంటి యువ స్పిన్నర్లకు ఆయన మార్గనిర్దేశం చేయనున్నారు.
