
- రికార్డులు అందజేయాలని సీఐడీకి లెటర్
- త్వరలో ఈసీఐఆర్ నమోదు
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిధుల గోల్‌మాల్ కేసులోకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎంట్రీ ఇచ్చింది. ఎఫ్ఐఆర్, నిందితుల రిమాండ్ రిపోర్ట్ సహా సీజ్ చేసిన హెచ్‌సీఏ రికార్డులను అందజేయాలని శుక్రవారం సీఐడీకి లెటర్ రాసింది. వాటి ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేసి, దర్యాప్తు చేపట్టనుంది. ముఖ్యంగా బీసీసీఐ నుంచి వచ్చిన నిధుల దారిమళ్లింపుపై ఫోకస్ పెట్టనుంది. మనీలాండరింగ్ కోణంలో విచారణ చేయనుంది.
ఇందులో భాగంగా ప్రధాన నిందితుడైన హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు సహా ఐదుగురు నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. కాగా, బీసీసీఐ నుంచి గ్రాంట్ రూపంలో ప్రతి ఏటా దాదాపు రూ.100 కోట్ల నిధులు వస్తాయని, ఇందులో భారీగా నిధులు దారిమళ్లాయని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు గురువారెడ్డి ఆరోపించారు. ఆయన స్టేట్‌మెంట్‌ను సీఐడీ ఇప్పటికే రికార్డ్ చేయగా, దాన్ని కూడా ఈడీ పరిగణనలోకి తీసుకోనుంది. క్రికెట్ బాల్స్, స్టేడియంలో చైర్లు, అగ్నిమాపక పరికరాలు, టికెట్ల అమ్మకాలు, ప్రకటనల ద్వారా వచ్చిన ఆదాయం సహా హెచ్‌సీఏ అకౌంట్ల నుంచి చెల్లించిన డబ్బుకు సంబంధించిన వివరాలు రాబట్టనుంది.
నిందితుల కస్టడీ కోసం సీఐడీ పిటిషన్..
ఈ కేసులో హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు, ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈవో సునీల్ కంటే సహా శ్రీచక్ర క్రికెట్ క్లబ్ అధ్యక్షురాలు కవిత, ఆమె భర్త రాజేందర్ యాదవ్ (క్లబ్ జనరల్ సెక్రటరీ)ను సీఐడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. వీళ్లను 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీఐడీ అధికారులు శుక్రవారం మల్కాజిగిరి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిగే అవకాశముంది.
హెచ్‌సీఏ అవినీతి వెనుక బీఆర్ఎస్ పెద్దల హస్తం: టీసీఏ సెక్రటరీ గురువా రెడ్డి
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)లో జరిగిన అవినీతి వెనుక బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉన్నదని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (టీసీఏ) సెక్రటరీ దారం గురువారెడ్డి ఆరోపించారు. ఈ కేసులో పూర్తి స్థాయి విచారణ జరిగితే నిజాలు బయటికి వస్తాయని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. హెచ్‌సీఏలో రూ.170 కోట్ల స్కామ్ జరిగిందన్నారు. గత ఐదేండ్లలో హెచ్‌సీఏకు సుమారు రూ.500 కోట్ల ఆదాయం వచ్చినా.. క్రికెట్ అవసరాల కోసం గజం భూమి కూడా కొనలేదని మండిపడ్డారు.
బీఆర్ఎస్ సపోర్ట్‌తోనే క్రికెట్‌తో సంబంధం లేని వ్యక్తికి అధ్యక్ష పీఠం దక్కిందన్నారు. ఫోర్జరీ సంతకాలతో జగన్‌మోహన్ రావు డాక్యుమెంట్లను సృష్టించారని ఆరోపించారు. అర్హత లేకున్నా హెచ్‌సీఏ అధ్యక్షుడయ్యాడని విమర్శించారు. హెచ్‌సీఏలో అవినీతిపై నెల రోజుల కిందే తాము ఫిర్యాదు చేశామన్నారు. సీఐడీ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేయాలని కోరారు.