వాగ్దానం చేసినట్లుగానే ప్రమోషన్లు ఇచ్చినం.. 118 మంది ఏఈలను డీఈలుగా చేసినం: మంత్రి వెంకట్రెడ్డి

వాగ్దానం చేసినట్లుగానే ప్రమోషన్లు ఇచ్చినం.. 118 మంది ఏఈలను డీఈలుగా చేసినం: మంత్రి వెంకట్రెడ్డి
  • ఇంజనీర్లు ఆర్​ అండ్ ​బీ శాఖను బలోపేతం చేయాలని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఏ శాఖలో లేని విధంగా రోడ్లు భవనాల శాఖలో పనిచేసే ఇంజనీర్లకు పూర్తి పారదర్శకతో ప్రమోషన్స్ ఇచ్చినమని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి ఏండ్లుగా పెండింగ్ లో ఉన్న సర్వీస్ రూల్స్ అప్రూవల్ చేసుకొని రెగ్యులర్ ప్రమోషన్స్ చేసినమన్నారు. 

‘‘నేను ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా. ఇంజినీర్లంతా కూడా పూర్తిస్థాయిలో పనిచేస్తూ ఆర్ అండ్ బీ శాఖ బలోపేతం కోసం కృషి చేయాలి’ అని సూచించారు. ప్రజల్లో ఆర్ అండ్ బి శాఖ కు మంచి పేరు తీసుకువచ్చే బాధ్యత ఈ శాఖ ఇంజనీర్ల పైనే ఉందని వారికి తెలిపారు. ఇటీవల ఎన్నికైన ఆర్ అండ్ బి ఇంజనీర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ సభ్యులు గురువారం హైదరాబాద్​లోని మంత్రి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసారు. 

ఈ సందర్భంగా మంత్రి వెంకట్​రెడ్డి మాట్లాడుతూ ‘తనను కలిసి వినతులు ఇచ్చినప్పుడు మీకు తప్పకుండా శాఖ పరమైన ప్రమోషన్స్ వచ్చేలా చేస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను’ అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి 118 మంది ఏఈలు డీఈలుగా ప్రమోషన్స్ పొందారని, అలాగే 72 మంది డీఈలు, ఈఈ లుగా, 29 మంది ఈఈలు ఎస్ఈ లుగా, ఆరుగురు ఎస్ఈ లు సీఈలుగా, ఇద్దరు సీఈలు ఈఎన్సీలుగా ప్రమోషన్స్ పొందారని గుర్తు చేశారు. 

మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ శాఖ బలోపేతం పై దృష్టి పెట్టి అదే స్థాయిలో పని చేసేయాలని మంత్రి ఆకాక్షించారు. శాఖ పరమైన, ఆమోదయోగ్యమైన సమస్యలు ఏమున్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంత్రిని కలసిన వారిలో ఆర్ అండ్ బీ ఇంజనీర్స్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు ఎన్. శ్రీను, జనరల్ సెక్రటరీ బి.రాంబాబు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి. శరత్ చంద్ర, ట్రెజరర్ మహేందర్ కుమార్, వైస్ ప్రెసిడెంట్లు కె.సంధ్య, వేణు, ప్రదీప్ రెడ్డి తదితరులు ఉన్నారు.