
నిర్మల్: పోలీస్ స్టేషన్లోనే హెడ్ కానిస్టేబుల్‌పై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.ఈ ఘటన నిర్మల్ జిల్లా కుబీర్ పోలీస్ స్టేషన్లో గురువారం (సెప్టెంబర్ 18) రాత్రి జరిగింది. వివరాల ప్రకారం.. అబ్దుల్ కలీమ్ అనే వ్యక్తి గురువారం (సెప్టెంబర్ 18) రాత్రి 10 గంటల ప్రాంతంలో కుబీర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. నేరుగా ఎస్ఐ రూములోకి వెళ్లబోతుండగా నైట్ డ్యూటీ చేస్తోన్న అబ్దుల్ కలీమ్‌ను హెడ్ కానిస్టేబుల్ నారాయణ అడ్డుకోబోయాడు. దీంతో హెడ్ కానిస్టేబుల్ నారాయణపై కత్తితో దాడి చేశాడు అబ్దుల్.
అక్కడే ఉన్న హోంగార్డు గిరి అడ్డుకోవడానికి రాగా బలంగా తోసేయడంతో అతని చేతులకు గాయాలు అయ్యాయి. వీరి అరుపులకు మిగతా సిబ్బంది, స్టేషన్ వెనుక క్వార్టర్లలోని పోలీసులు రావడంతో నిందితుడు పరారయ్యాడు. గాయపడిన హెడ్ కానిస్టేబుల్ నారాయణ, హోంగార్డ్ గిరికి కుభీర్‌లో ప్రాథమిక చికిత్స అందించి అనంతరం మెరుగైన వైద్యం కోసం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఏకంగా స్టేషన్లోనే కానిస్టేబుల్‌పై దాడి చేయడంతో ఈ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం (సెప్టెంబర్ 19) తెల్లవారుజూమున నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తి మహారాష్ట్ర ప్రాంతం నుంచి వలస వచ్చినట్లు భావిస్తున్నారు పోలీసులు. నిందితుడు అసలు స్టేషన్‌కు కత్తి ఎందుకు తీసుకొచ్చాడు..? నేరుగా ఎస్ఐ రూములోకే ఎందుకు వెళ్లబోయాడు..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.