సింగరేణి గ్లోబల్ విస్తరణకు ఎస్‌‌బీఐ సహకారం

సింగరేణి గ్లోబల్ విస్తరణకు ఎస్‌‌బీఐ సహకారం
  •     బ్యాంక్ చైర్మన్​తో ముంబైలో సీఎండీ బలరామ్ భేటీ
  •     తక్కువ వడ్డీతో రుణాలిచ్చి సహకరించాలని వినతి
  •     హెల్ప్ చేస్తామని ఎస్​బీఐ చైర్మన్ హామీ

హైదరాబాద్, వెలుగు: దేశ, విదేశాల్లో సింగరేణి సంస్థ చేపట్టనున్న విస్తరణ ప్రాజెక్టులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌‌బీఐ) సహకారం అందించనున్నది. ఈ మేరకు సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ ముంబైలోని ఎస్‌‌బీఐ ప్రధాన కార్యాలయంలో ఆ సంస్థ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి, డిప్యూటీ ఎండీ సత్యేంద్ర కుమార్ సింగ్, సీజీఎం శైలేశ్ ఉన్నితన్‌‌తో గురువారం సమావేశం అయ్యారు. సింగరేణి సంస్థ చేపట్టనున్న ప్రాజెక్టుల గురించి వివరించారు. ‘‘క్రిటికల్ మినరల్స్ రంగంలోకి త్వరలో సింగరేణి సంస్థ అడుగుపెట్టనున్నది. 

కర్నాటకలో బంగారం, రాగి ఖనిజాల అన్వేషణకు లైసెన్స్ వచ్చింది. ప్రైవేటు ఏజెన్సీ ద్వారా కీలక ఖనిజాలపై స్టడీ చేస్తున్నాం. కేంద్రం అందిస్తున్న రాయితీలను వినియోగించుకుంటూ దేశవ్యాప్తంగా కీలక ఖనిజాల ఉత్పత్తిని పెంచుతున్నాం. అలాగే, పంప్డ్ స్టోరేజీ ప్లాంట్లు, 5 వేల మెగావాట్ల సోలార్, థర్మల్ ప్లాంట్లు, గ్రీన్ హైడ్రోజన్, మిథనాల్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నం. ఈ ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రుణాలు అందించాలి’’అని బలరామ్ కోరారు. ఎస్‌‌బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి స్పందిస్తూ.. సింగరేణి అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. సంస్థకు దశాబ్దాలుగా లీడ్ బ్యాంక్‌‌గా సేవలు అందిస్తున్న ఎస్‌‌బీఐ, సింగరేణి అంతర్జాతీయ స్థాయి మైనింగ్ కంపెనీగా రాణించాలని ఆకాంక్షించారు. కాగా, సింగరేణి దశాబ్దాలుగా ఎస్‌‌బీఐ ద్వారానే తన ఆర్థిక లావాదేవీలను నిర్వహిస్తున్నది. 75 శాతం మంది కార్మికులకు ఎస్‌‌బీఐలో ఖాతాలు ఉన్నాయి.