
- హవాలా, మనీలాండరింగ్‌తో రూ.3,500 కోట్లు తరలింపు
- హైదరాబాద్‌లోని పలు కంపెనీల ద్వారా కిక్ బ్యాక్స్ చెల్లింపులు
హైదరాబాద్, వెలుగు:
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ స్కామ్‌లో బోగస్ కంపెనీల ద్వారా జరిగిన కిక్‌బ్యాక్స్ వివరాలు రాబట్టింది. షెల్ కంపెనీలు, నకిలీ ఇన్వాయిస్‌లతో రూ.3,500 కోట్లు మనీలాండరింగ్ జరిగినట్లు ఆధారాలు సేకరించింది. హైదరాబాద్, ఏపీ, తమిళనాడు, కర్నాటక, న్యూఢిల్లీ సహా మొత్తం 20 ప్రాంతాల్లో గురువారం ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.
సికింద్రాబాద్ వెస్ట్ మారేడ్ పల్లిలోని వెల్లింగ్టన్ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న వ్యాపారవేత్త బూరుగు రమేశ్ అతని కుమారుడు విక్రాంత్ నివాసాల్లో దాదాపు 7 గంటల పాటు తనిఖీలు చేశారు. వీరిద్దరూ కాస్పో లీగల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మహాదేవ జువెలర్స్‌తోపాటు రాజశ్రీ ఫుడ్స్‌లో డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు.
హైదరాబాద్‌లోని 10 ప్రాంతాల్లో సోదాలు
బూరుగు రమేశ్ కంపెనీలతో పాటు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పలు కంపెనీల ద్వారా హవాలా, మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. షెల్ కంపెనీలు, కిక్ బ్యాక్స్, హవాలా ద్వారా మనీలాండరింగ్ జరిగినట్టు ఈడీ ఆధారాలు సేకరించింది. నకిలీ ఇన్వాయిస్లు క్రియేట్ చేసి ముడుపుల ద్వారా వచ్చిన నగదును లిక్కర్ స్కామ్ లో షెల్ కంపెనీలకు తరలించినట్లు గుర్తించింది.
ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్, రాజేంద్రనగర్, పంజాగుట్ట, సైబరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సైదాబాద్ లోని రియల్ ఎస్టేట్, జువెల్లరీ వ్యాపారులు సహా లిక్కర్ సరఫరా చేసే పలు బేవరెజెస్ సంస్థలు, నిర్వాహకుల ఇండ్లలో సోదాలు నిర్వహించింది. బూరుగు రమేశ్ ఇంటితో పాటు ఐదు రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లో భారీగా నగదు, షెల్ కంపెనీలకు చెందిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. వీటిని బషీర్ బాగ్‌లోని హైదరాబాద్ జోన్ ఈడీ కార్యాలయానికి తరలించారు. సోదాలు శుక్రవారం కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి.
నిందితుల జాబితాలో 19 సంస్థలు
వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో లిక్కర్‌షాపులు తెరిచి ఎంపిక చేసుకున్న కొన్ని డిస్టిలరీల ద్వారా రకరకాల పేర్లతో మద్యం ఉత్పత్తి చేయించారనే ఆరోపణలు ఉన్నాయి. కమీషన్లు ఇచ్చిన కంపెనీలకే అధిక ఆర్డర్లు, బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి మద్యం సరఫరదారుకు బిల్లులు చెల్లింపులు సహా దాదాపు రూ.3,500 కోట్ల దోపిడీకి పాల్పడినట్లు ఏపీ సీఐడీ, సిట్ దర్యాప్తులో వెలుగుచూసింది.
ఈ మొత్తాన్ని డొల్ల కంపెనీలు, బినామీ సంస్థల ద్వారా మళ్లించినట్లు సిట్ తన చార్జిషీట్లలో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటివరకూ 29 మంది వ్యక్తులు సహా 19 సంస్థలను నిందితులుగా చేర్చారు. 12 మందిని అరెస్టు చేశారు. మద్యం ముడుపులను విదేశాలకు హవాలామార్గంలో తరలించారనే కోణంలో ఈడీ రంగంలోకి దిగింది. లిక్కర్ స్కామ్ నిందితులు సహా 19 సంస్థల ఆర్ధికలావాదేవీల ఆధారంగా దర్యాప్తు చేపట్టింది.