క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌కు మరోసారి అండగా నిలిచిన బీసీసీఐ

క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌కు మరోసారి అండగా నిలిచిన బీసీసీఐ

న్యూఢిల్లీ: కారు యాక్సిడెంట్‌లో గాయపడిన టీమిండియా క్రికెటర్‌ రిషబ్‌ పంత్‌కు బీసీసీఐ మరోసారి అండగా నిలిచింది. ఇప్పటికే మొత్తం మెడికల్‌ ఖర్చులను భరిస్తున్న బోర్డు.. అతని జీతం విషయంలోనూ శుభవార్త చెప్పింది. ఐపీఎల్‌ సాలరీతో పాటు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ డబ్బులను కూడా పూర్తిగా చెల్లించనుంది. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడేందుకు పంత్‌ రూ. 16 కోట్లు తీసుకుంటున్నాడు. బోర్డు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కింద ఏడాదికి రూ. 5 కోట్లు ఇస్తోంది.

అయితే గాయం కారణంగా పంత్‌ ఇప్పుడు ఐపీఎల్‌కు దూరం కావడంతో డీసీ ఇవ్వాల్సిన రూ. 16 కోట్లతో కలిపి మొత్తం రూ. 21 కోట్లను బోర్డే చెల్లించనుంది. సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ కలిగిన ప్లేయర్‌ గాయం లేదా ఇతర కారణాలతో ఐపీఎల్‌కు దూరమైతే ఆ డబ్బును బీసీసీఐ చెల్లించాలన్న రూల్‌ ఉంది. అయితే ఐపీఎల్‌ సాలరీని బోర్డు తన ఖజానా నుంచి చెల్లించాల్సిన పని లేదు. ఐపీఎల్‌లో ఆడే సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ప్లేయర్లకు బోర్డు తరఫున ఇన్సురెన్స్‌ చేస్తారు. ఆ డబ్బులను ఇన్సురెన్స్‌ కంపెనీలు భరిస్తాయి. ఇందులో ఫ్రాంచైజీకి ఎలాంటి సంబంధం ఉండదు.