BCCI’s new incentive scheme: 14 మ్యాచ్‌లకు కోటి రూపాయలు.. యువ క్రికెటర్లకు బీసీసీఐ బంపర ఆఫర్

BCCI’s new incentive scheme: 14 మ్యాచ్‌లకు కోటి రూపాయలు.. యువ క్రికెటర్లకు బీసీసీఐ బంపర ఆఫర్

ఐపీఎల్ ఆడబోయే యంగ్ క్రికెటర్లకు బీసీసీఐ కొత్తగా రూల్ ప్రవేశపెట్టింది. ఆదివారం (సెప్టెంబర్ 28) జరిగిన బోర్డు వార్షిక సర్వసభ్య సమావేశంలో అండర్-19, అండర్-16 ప్లేయర్స్ ఐపీఎల్‌కు అర్హత సాధించాలంటే కనీసం ఒక ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాలని ఆదేశించబడింది. బీసీసీఐ వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) సందర్భంగా ఈ నిర్ణయం ఖరారు చేయబడింది. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు ఈ రూల్ అమలు చేయబడుతుంది. యువత ఐపీఎల్‌లో వెలుగులోకి వచ్చి చాలా చిన్న వయస్సులోనే పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడం కంటే దీర్ఘకాల ఫార్మాట్‌పై ఎక్కువ దృష్టి పెట్టేలా ప్రోత్సహించడం ఈ చర్య లక్ష్యం.

ఒక సీజన్‌లో ఎక్కువ దేశీయ మ్యాచ్‌ల్లో పాల్గొనే ఆటగాళ్లకు అధిక జీతాలు లభిస్తాయని బీసీసీఐ ప్రకటించింది. ఎక్కువ మ్యాచ్ లు ఆడినవారికి  బహుమతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఒక ఆటగాడు ఒక సీజన్‌లో ఎక్కువ దేశీయ మ్యాచ్‌లు ఆడితే, అతనికి ఎక్కువ డబ్బు లభిస్తుందని నిర్ణయించబడింది. ఇది జట్లు దేశీయ టోర్నమెంట్లలో ఫైనల్స్‌కు చేరుకోవడానికి ప్రోత్సాహకంగా ఉంటుంది. ఒక క్రికెటర్ ఒక సీజన్‌లో 14 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడితే, అతనికి అదనంగా రూ. 1 కోటి మ్యాచ్ ఫీజు లభిస్తుంది. ఈ కొత్త రూల్ తో 14 ఏళ్ళ కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ ఆడడంపై అనుమానాలు నెలకొన్నాయి. 

రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ వయసు 14 ఏళ్ళు కావడంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ యువ క్రికెటర్ పై పడింది. ఐపీఎల్ 2025 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో 35 బంతుల్లోనే సెంచరీ చేసి ప్రపంచ క్రికెట్ దృష్టిని ఈ బీహార్ కుర్రాడు తనవైపుకు తిప్పుకున్నాడు. రాజస్థాన్ రూ.1.10 కోట్లకు వైభవ్ ను కొనుగోలు చేసింది. 13 ఏళ్ళ వయసులో ఐపీఎల్ లో సెంచరీ చేసిన సూర్యవంశీ ఈ మెగా లీగ్ లో అతి చిన్న వయసులో సెంచరీ చేసిన ప్లేయర్ గా నిలిచాడు. బీసీసీఐ తీసుకొచ్చిన కొత్త రూల్ తో వైభవ్ ఐపీఎల్ ఆడడానికి అర్హుడేనా ఇప్పుడు చూద్దాం. 

వైభవ్ సూర్యవంశీ ఇప్పటివరకు ఐదు ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు. 63.29 స్ట్రైక్ రేట్‌తో 100 పరుగులు చేశాడు. ఐపీఎల్ లోకి రాకముందే అతనికి ప్రొఫెషనల్ క్రికెట్ ఆడిన అనుభవం ఉందని నిరూపించాడు. అండర్-19 ఆటగాళ్లలో ఆయుష్ మాత్రే, ఆండ్రీ సిద్ధార్థ్, ముషీర్ ఖాన్, స్వస్తిక్ చికారా కూడా ఫస్ట్ క్లాస్ ఆడిన అనుభవం ఉంది.