ఏదీ క్లారిటీ ! దిశ లేని ప్రయోగాలతో టీమిండియాలో గందరగోళం

ఏదీ క్లారిటీ ! దిశ లేని ప్రయోగాలతో టీమిండియాలో గందరగోళం
  • వన్డేల్లోనూ టీమ్ మేనేజ్‌‌మెంట్ అనూహ్య నిర్ణయాలు
  • రాంచీ మ్యాచ్‌లో ఓపెనర్‌‌‌‌ రుతురాజ్‌‌ను 4వ నంబర్‌‌‌‌లో ఆడించడంపై విమర్శలు

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌‌లో ఘోర ఓటమి తర్వాత రాంచీ గడ్డపై తొలి వన్డేలో  సాధించిన విజయం టీమిండియాకు ఊరట కలిగించింది. మరీ ముఖ్యంగా కింగ్ కోహ్లీ తన విశ్వరూపం చూపెడుతూ అద్భుత సెంచరీతో చెలరేగడంతో అభిమానులు ఫిదా అయ్యారు. కోహ్లీ క్లాస్ ఆటకు అంతా సలాం కొట్టినా.. ఈ పోరులో టీమ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ తీసుకున్న నిర్ణయాలు చాలా మందిని ఆశ్చర్యపరిచాయి. 

రిజర్వ్ ఓపెనర్‌‌గా ఎంపికైన రుతురాజ్ గైక్వాడ్‌‌ను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌‌కు దించడం ఇండియన్‌‌ క్రికెట్‌‌లో ప్రస్తుతం నెలకొన్న అనిశ్చితికి, స్పష్టత లేని టీమ్ సెలెక్షన్‌‌ తీరుకు సంకేతం అనొచ్చు. ఒక ప్లానింగ్ అంటూ లేకుండా అప్పటికప్పుడు తీసుకుంటున్న నిర్ణయాలు జట్టును ఎలా గందరగోళంలోకి నెట్టేస్తున్నాయో చెప్పడానికి ఇది మరో ఉదాహరణ.

స్పెషలిస్ట్ ఓపెనర్‌‌‌‌కు మిడిలార్డర్ బాధ్యతా?
డొమెస్టిక్ క్రికెట్‌‌లో రుతురాజ్ గైక్వాడ్‌‌కు అద్భుత రికార్డు ఉంది. లిస్ట్-–ఏ క్రికెట్‌‌లో నిలకడగా 55కి పైగా సగటు నమోదు చేసిన అతి కొద్దిమంది బ్యాటర్లలో గైక్వాడ్ ఒకడు. కెరీర్‌‌లో ఆడిన 87 ఇన్నింగ్స్‌‌ల్లో దాదాపుగా ఓపెనర్‌‌గానే వచ్చాడు.  మూడో నంబర్‌‌‌‌లో ఆడింది కేవలం ఐదు సార్లు మాత్రమే. అలాంటి ప్రూవెన్‌‌ ఓపెనింగ్ బ్యాటర్‌‌ను 16 నెలల తర్వాత తిరిగి నేషనల్ టీమ్‌‌లోకి తీసుకునిఏమాత్రం అలవాటు లేని నాలుగో స్థానంలో ప్రయోగించడం ఎంతవరకు సమంజసం? అన్న ప్రశ్న వస్తోంది. 

గిల్, అయ్యర్ లేకపోవడం వల్ల ఖాళీ అయిన ఆ స్థానానికి ఆసియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మ, రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్ వంటి స్పెషలిస్టులు పోటీదారులుగా ఉన్నారు. వారిని పక్కన పెట్టి ఓపెనర్ రుతురాజ్‌‌ను అనూహ్యంగా మిడిల్ ఆర్డర్‌‌లో దించడం సెలెక్టర్లు, కోచ్‌‌ ఆలోచనా విధానంలో క్లారిటీ లోపించిందని స్పష్టంగా చెబుతోంది. ఇది గైక్వాడ్‌‌ ప్రతిభను పరీక్షించడం కంటే మేనేజ్‌‌మెంట్ అయోమయాన్నే ఎక్కువగా సూచించింది. 

తప్పు పెద్దలదే.. క్లారిటీ ఎవరివ్వాలి?
ఇటీవలి పరాజయాలు, గందరగోళాల నేపథ్యంలో.. అభిమానుల ఆగ్రహం ఆటగాళ్లపై కాకుండా, జట్టుకు దిశానిర్దేశం చేస్తున్న గంభీర్, చీఫ్ సెలెక్టర్‌‌‌‌ అగార్కర్ పైనే ఎక్కువగా ఉంది. ఒకప్పుడు సెలెక్టర్లు జట్టును ఇస్తే.. కెప్టెన్, కోచ్ తుది జట్టును ఎంచుకునేవారు. ఇప్పుడు ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటున్నారో తెలియడం లేదు. లెజెండరీ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్టులు, టీ20ల నుంచి తప్పుకున్న ఈ కీలక సమయంలో  ఇండియా క్రికెట్‌‌ను ఎంతో జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాలి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్  జట్లు ఇలాంటి సమయంలోనే పక్కా ప్రణాళికలతో పుంజుకున్నాయి. 

రాబోయే టీ20, వన్డే వరల్డ్ కప్‌‌లు, టెస్ట్ చాంపియన్‌‌షిప్ దృష్ట్యా.. మన జట్టుకు ఇప్పుడు కావాల్సింది గుడ్డి ప్రయోగాలు కాదు. ప్రతి ఆటగాడి పాత్రపై స్పష్టత, టీమ్ సెలెక్షన్‌‌లో పారదర్శకత, వ్యూహాల్లో నిలకడ ఉండాలి. ఈ క్లారిటీ లేకపోతే, రుతురాజ్ గైక్వాడ్ లాంటి టాలెంటెడ్‌‌ ప్లేయర్లు తమ తప్పు లేకుండానే ఇలాంటి లోపాల కారణంగా తెరమరుగయ్యే ప్రమాదం ఉంది. అసలు, టీమిండియాలో ఆ క్లారిటీ ఎవరివ్వాలి? అన్న ప్రశ్నకు కోచ్, సెలెక్టర్లు సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.

ఆటగాళ్లలో అభద్రత
గౌతమ్ గంభీర్ హెడ్‌‌ కోచ్‌‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జట్టులో ప్రయోగాలు శృతిమించాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌‌‌‌, గంభీర్ కలిసి టీమిండియాను క్రికెట్ ల్యాబ్‌‌గా మార్చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.  ఒక ప్లానింగ్‌‌తో కూడిన మార్పులు కాకుండా, అప్పటికప్పుడు తీసుకునే నిర్ణయాలు జట్టును దెబ్బతీస్తున్నాయి.  సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ ఓటమే ఇందుకు నిదర్శనం. 

మూడో నంబర్‌‌‌‌లో ఒక మ్యాచ్‌‌లో వాషింగ్టన్ సుందర్‌‌ను, మరో మ్యాచ్‌‌లో సాయి సుదర్శన్‌‌ను ఆడించారు. ఫలితం? ఘోర పరాజయం!. ఇలా తరచూ చేసే మార్పుల వల్ల జట్టులో ఆటగాళ్లకు తమ పాత్ర ఏంటో తెలియనప్పుడు, వారిలో అభద్రతా భావం  పెరిగిపోతుంది. అప్పుడు వాళ్లు జట్టు గెలుపు కోసం కాకుండా తర్వాతి మ్యాచ్‌‌లో తమ స్థానం ఉంటుందో లేదో అనే భయంతో రక్షణాత్మక ధోరణితో ఆడతారు. ఇది ఇండియా క్రికెట్ భవిష్యత్తుకు ప్రమాదకరం.