
ముంబై: ఐపీఎల్‌లో మరో కొత్త అంకానికి తెరలేవనుంది. 2008లో ఎనిమిది జట్లతో మొదలైన ఈ ధనాధన్ లీగ్‌లో అదనంగా మరో రెండు టీమ్స్‌ను చేర్చనున్నారు. ఐపీఎల్‌లో కొత్త జట్లను చేర్చే విషయంలో బీసీసీఐ చాలా సుముఖంగా ఉంది. ఇందుకు అనుగుణంగా ఈనెల 24న జరగబోయే యాన్యువల్ జనరల్ మీటింగ్(ఏజీఎం)లో ఈ అంశాన్ని అజెండాలో చేర్చింది. ముంబై వేదికగా జరిగే ఈ ఏజీఏంకు సంబంధించిన అజెండాను బీసీసీఐ గురువారం స్టేట్ అసోసియేషన్లకు పంపింది. మొత్తం 23 అంశాలను అజెండాలో పేర్కొనగా.. ఐపీఎల్ టీమ్స్ సంఖ్య పెంపు, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చడం ఇందులో ముఖ్యమైనవి. నిజానికి, ఐపీఎల్ 2020 ఎడిషన్ ముగిసినప్పటి నుంచి కొత్త జట్ల అంశంపై చర్చ జరుగుతూనే ఉంది. అదానీ గ్రూప్, సంజీవ్ గోయెంకాకు చెందిన ఆర్‌పీజీ( రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ ఓనర్) కంపెనీలు కొత్త ఫ్రాంచైజీల కోసం పోటీపడుతున్నట్లు వార్తలొచ్చాయి. మొన్నటిదాకా ఒకే జట్టును చేరుస్తారన్న వార్తలు రాగా.. ఏజీఎం అజెండాలో బీసీసీఐ రెండు జట్లు అని పేర్కొన్నది. దాంతో, 2021లో జట్ల సంఖ్య పదికి చేరే చాన్సుంది. ఇందులో ఒక టీమ్ అహ్మదాబాద్ బేస్‌గా ఉండడం ఖాయంగా కనిపిస్తోంది.
పది జట్లు వస్తే ఫార్మాట్ మార్పు?
ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లను చేర్చేందుకు సభ్యులు (స్టేట్ అసోసియేషన్లు) అంగీకారం తెలిపితే లీగ్ ఫార్మాట్‌లో మార్పులకు చాన్సుంది . నిజానికి ఓ సీజన్‌లో 10 జట్లు ఆడటం ఐపీఎల్‌కు కొత్త కాదు. పుణె వారియర్స్, కొచ్చి టస్కర్స్ చేరికతో 2011 సీజన్‌లో 10 జట్లు బరిలోకి దిగాయి. హోమ్ అండ్ అవే ఫార్మాట్‌లో జరిగిన ఆ సీజన్‌లో మొత్తం 94 మ్యాచ్‌లు జరిగాయి. కానీ టోర్నీ నిడివి ఎక్కువ కావడంతో పలు సమస్యలు వచ్చాయి. అయితే, ఇప్పుడు జట్ల సంఖ్య పది అయితే రెండు గ్రూపులుగా విభజించే చాన్సుంది. లీగ్ స్టేజ్‌లో మొత్తం70 మ్యాచ్‌లు, నాలుగు ప్లే ఆఫ్స్‌తో టోర్నీని ముగించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ విధానంలో లీగ్ ఫేజ్‌లో ప్రతి టీమ్ 14 మ్యాచ్‌లు ఆడుతుంది. ప్రతీ జట్టు తమ గ్రూప్‌లో ఉన్న ఇతర నాలుగు టీమ్స్‌తో ఇంటా బయటా విధానంలో 8 మ్యాచ్‌లు ఆడుతుంది. ఆ తర్వాత మరో గ్రూప్‌లోని 4 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. మిగిలిన ఐదో జట్టుతో మాత్రం రెండు మ్యాచ్‌లాడుతుంది. వేరే గ్రూప్ జట్లతో ఆడే మ్యాచ్‌లను ప్రత్యేకమైన డ్రా ద్వారా నిర్ణయిస్తారు. కాగా, 2013 ఐపీఎల్‌లో చివరిగా తొమ్మిది జట్లు తలపడగా మొత్తం 76 మ్యాచ్‌లు జరిగాయి.
ముగ్గురు కొత్త సెలెక్టర్లపై చర్చ
ఐసీసీతోపాటు ఏషియన్ క్రికెట్ కౌన్సిల్‌లో బీసీసీఐ ప్రతినిధిగా సెక్రటరీ జైషాను ఏజీఎంలో ఎంపిక చేసే అవకాశం కనిపిస్తోంది. ఖాళీగా ఉన్న బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ స్థానాన్ని కూడా భర్తీ చేయనున్నారు. సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ సహా ముగ్గురు కొత్త సెలెక్టర్ల ఎంపిక, టీమిండియా2021 ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రామ్, టీ20 వరల్డ్‌కప్ ఆతిథ్యం తదితర అంశాలపై ఏజీఎంలో చర్చించనున్నారు.
2028 ఒలింపిక్స్‌లో క్రికెట్ ?
లాస్ ఏంజిల్స్ వేదికగా 2028లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చే అంశంపై ఈసారి ఏజీఎంలో చర్చ జరగనుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. నాలుగేళ్లకు ఒకసారి వచ్చే ఒలింపిక్స్ సాధారణంగా జులై– ఆగస్టు నెలల్లో జరుగుతాయి. అయితే, ఆ టైమ్‌లో బైలేటరల్ సిరీస్‌లను రద్దు చేసుకునేందుకు ఇష్టపడని ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, ఇండియా బోర్డులు ఇన్నాళ్లూ ఒలింపిక్స్‌లో క్రికెట్ అంశాన్ని వెనక్కునెడుతూ వస్తున్నాయి. కానీ, నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా) కింద పని చేసేందుకు బీసీసీఐ ఇటీవల ఒప్పుకోవడంతో ఐసీసీ ఈ అంశాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. ఇందులో భాగంగా మెగా ఈవెంట్‌లో క్రికెట్‌ను చేర్చితే తమ ప్రభుత్వాలు అందించే సహకారం, ఫైనాన్షియల్ అంశాలపై అభిప్రాయాలు చెప్పాలని ఇంటర్నేషనల్ బాడీ తమ సభ్యులకు ప్రశ్నోత్తరాలు పంపింది. ఏజీఎంలో స్టేట్ అసోసియేషన్లతో చర్చించి బీసీసీఐ తన అభిప్రాయం వెల్లడించనుంది.