గొర్రెలు, బర్రెలు, పింఛన్లు అంటూ..బీసీలను బిచ్చగాళ్లను చేస్తున్రు: ఆర్.కృష్ణయ్య

గొర్రెలు, బర్రెలు, పింఛన్లు అంటూ..బీసీలను బిచ్చగాళ్లను చేస్తున్రు: ఆర్.కృష్ణయ్య
  • పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలె: ఆర్.కృష్ణయ్య
  • జంతర్ మంతర్ లో ధర్నా.. పలు పార్టీల నేతల మద్దతు


న్యూఢిల్లీ, వెలుగు: బీసీలకు రాజ్యాధికారంలో వాటా ఇవ్వకుండా గొర్రెలు, బర్రెలు, పింఛన్లు ఇచ్చి ఓట్లు వేయించుకొని శాశ్వతంగా బిచ్చగాళ్లను చేస్తున్నారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్.కృష్ణయ్య విమర్శించారు. బీసీ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తు శుక్రవారం ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఆయన ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు పలు పార్టీల నేతలు మద్దతు తెలిపారు. ఎంపీలు శ్యామ్ సింగ్, బినయ్ విశ్వాన్, కాంగ్రెస్ నేత మల్లు రవి, సీపీఐ నేత నారాయణ హాజరై సంఘీభావం ప్రకటించారు. 

ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. పార్లమెంట్ లో బీసీ బిల్లుపెట్టి.. చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అలాగే కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు. అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన అగ్రకులాలకు ఒక రోజులో బిల్లు పెట్టి 10 శాతం రిజర్వేషన్లను కేంద్రం కల్పించిందన్నారు. కానీ బీసీలకు చట్ట సభలలో రిజర్వేషన్లు పెట్టాలని 30 ఏండ్లుగా పోరాడుతున్నా పట్టించుకోవడంలేదని విమర్శించారు.
 

తెలంగాణలో 20 జిల్లాల్లో బీసీ ఎమ్మెల్యేలు లేరు


తెలంగాణ లో  33 జిల్లాలు ఉండగా 20 జిల్లాల నుంచి ఒక్క బీసీ ఎమ్మెల్యే లేరని కృష్ణయ్య తెలిపారు. రాష్ట్రంలో 119 ఎమ్మెల్యే స్థానాలుంటే అందులో బీసీలు కేవలం 22 మంది ఉన్నారన్నారు. 52 శాతం జనాభా గల బీసీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం ఏది? బీసీలు ఓట్లు వేయడానికేనా? అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా చట్టసభల్లో బీసీల ప్రాతినిధ్యం 14 శాతం దాటలేదని ఇటీవల సేకరించిన కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయన్నారు. దేశంలో 28 రాష్ట్రాలు ఉండగా.. దాదాపు 16 రాష్ట్రాల నుంచి ఒక్క బీసీ పార్లమెంట్ సభ్యుడు లేరన్నారు. గత లోక్ సభలో కేవలం 96 మంది బీసీ ఎంపీలు ఉన్నారని చెప్పారు.