బీసీలను బిచ్చగాళ్లలా చూస్తున్నరు : జాజుల శ్రీనివాస్​ గౌడ్​

బీసీలను బిచ్చగాళ్లలా చూస్తున్నరు : జాజుల శ్రీనివాస్​ గౌడ్​
  • విద్య, వైద్య వ్యవస్థను పట్టించుకుంటలే
  • బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​గౌడ్​

ఎల్​బీ నగర్, వెలుగు: విద్య, వైద్య వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్​ గౌడ్​ అన్నారు. బీసీలను బిచ్చగాళ్ల మాదిరి చూస్తున్నారంటూ మండిపడ్డారు. బాలాపూర్​లో సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ‘బీసీల పోరుయాత్ర సభ’ లో ఆయన మాట్లాడారు. కార్పొరేట్ విద్యను నియంత్రించి కేజీ టు పీజీ ఉచిత విద్యను అందించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదన్నారు. ఫీజు రీయింబర్స్​మెంట్, స్కాలర్​షిప్​లు ఇస్తామని గొప్పగా చెప్పిన ప్రభుత్వం.. మూడున్నరేండ్లుగా బకాయిలు విడుదల చేయడం లేదని విమర్శించారు. నిరుపేద స్టూడెంట్స్ చదువుకు గండి కొడుతున్నారని మండిపడ్డారు. అర శాతం ఉన్నోళ్ల దగ్గర.. అరవై శాతం ఉన్నోళ్లు అడుక్కోవాల్సి పరిస్థితి నెలకొందన్నారు.

బీసీ విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో డిసెంబర్​ 2న పాలమూరు నుంచి ప్రారంభమైన పోరు యాత్ర.. పట్నం దాకా సాగుతుందని తెలిపారు. బీసీ గురుకులాలు, కాలేజీ హాస్టళ్లు, ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాల్లేవన్నారు. సంక్షేమ హాస్టల్స్​లో నాసిరకమైన దొడ్డు బియ్యంతో భోజనం పెడుతున్నారని విమర్శించారు. ప్రతీ ఊళ్లో గవర్నమెంట్​ స్కూల్, కాలేజీ, యూనివర్సిటీ పెట్టాలని తెలంగాణ సమాజం కోరుతుంటే.. గల్లి గల్లీకి బెల్ట్ షాపు, వీధికో వైన్​షాపు, ఊరికో బార్​ను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదన్నారు. విద్యాశాఖ మంత్రి ఇలాకాలోని గవర్నమెంట్​ బాలికల స్కూల్స్​లో టాయిలెట్లు లేవని మండిపడ్డారు. కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు రావుల కోల్ నరేశ్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుల్కచర్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.