కాంగ్రెస్‌‌తోనే బీసీలకు న్యాయం.. అసెంబ్లీలో తీర్మానం చేస్తే... కేంద్రంలోని బీజేపీ అడ్డుకుంటుంది..

కాంగ్రెస్‌‌తోనే బీసీలకు న్యాయం.. అసెంబ్లీలో తీర్మానం చేస్తే...  కేంద్రంలోని బీజేపీ అడ్డుకుంటుంది..
  • డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెల్లడి

ఖమ్మం, వెలుగు : రాష్ట్రంలో బీసీలకు సామాజిక న్యాయం పాటిస్తున్నది కాంగ్రెస్‌‌ మాత్రమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. బీసీ రిజర్వేషన్ల కోసం తాము అసెంబ్లీలో తీర్మానం చేస్తే, దానిని కేంద్రంలోని బీజేపీ అడ్డుకుందని ఆరోపించారు. బీసీలపై కాంగ్రెస్‌‌కు ఉన్న ప్రేమ బీజేపీకి లేదని విమర్శించారు. 

ఆదివారం జరిగిన ఖమ్మం డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ... బీసీ రిజర్వేషన్‌‌కు చట్టబద్ధత కోసం ఢిల్లీలో ధర్నా చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకోసం రూ.1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. సీతారామ ప్రాజెక్ట్‌‌ను త్వరగా పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. 

కాంగ్రెస్‌‌ వచ్చాక.. రెండేండ్లలో సాధించిన విజయాలను చెప్పడంతో పాటు వచ్చే మూడేండ్లలో ఏం చేయబోతామో కూడా ప్రజలకు వివరిస్తామని చెప్పారు. గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ క్యాండిడేట్లను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, వైరా ఎమ్మెల్యే రాందాసునాయక్‌‌, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి, గిడ్డంగుల కార్పొరేషన్‌‌ చైర్మన్‌‌ రాయల నాగేశ్వరరావు, హస్తకళల అభివృద్ధి కమిటీ చైర్మన్‌‌ నాయుడు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, పోట్ల నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే కొండబాల కోటేశ్వరరావు, మేయర్‌‌ పునుకొల్లు నీరజ, నగర కాంగ్రెస్​అధ్యక్షుడు మహ్మద్‌‌ జావేద్‌‌, నాగండ్ల దీపక్‌‌చౌదరి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దుబ్బల సౌజన్య పాల్గొన్నారు. అంతకు ముందు జడ్పీ సెంటర్‌‌ నుంచి జిల్లా పార్టీ ఆఫీస్‌‌ వరకు ర్యాలీ నిర్వహించారు. 

కార్యకర్తలను గెలిపించుకోవడం మన బాధ్యత : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

కష్టపడిన కార్యకర్తలకు కాంగ్రెస్‌‌లో ప్రాధాన్యం ఉంటుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. నూతి సత్యనారాయణకు పదవి ఇవ్వడంతో ఈ విషయం స్పష్టమైందన్నారు. నేడు జరగనున్న ఎర్త్‌‌ సైన్సెస్‌‌ యూనివర్సిటీ ప్రారంభ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరుకావాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలు కష్టపడి అసెంబ్లీ, పార్లమెంట్‌‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ అభ్యర్థులను గెలిపించారని, ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకోవడం తమ బాధ్యత అని చెప్పారు. 

కాంగ్రెస్‌‌ క్యాండిడేట్లను గెలిపించాలి

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ క్యాండిడేట్లను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌‌రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లాలో పార్టీ పటిష్టత కోసం నూతి సత్యనారాయణ కృషి చేయాలని సూచించారు. పార్టీని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలకు సమ ప్రాధాన్యం ఇచ్చి, సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.