
- బిల్లును చట్టబద్ధం చేసి 9వ షెడ్యూల్‌లో చేర్చాలి
- ఇచ్చిన మాట ప్రకారం బీసీ బిల్లు అమలుకు కృషి చేస్తున్న కాంగ్రెస్కు థ్యాంక్స్
- మీడియా సమావేశంలో బీసీల జేఏసీ నాయకులు
హైదరాబాద్ సిటీ, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం ఆపబోమని బీసీ జేఏసీ నాయకులు ప్రకటించారు. బీసీ బిల్లును చట్టబద్ధం చేసి 9వ షెడ్యూల్‌లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ బిల్లు అమలుకు కృషి చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగులు, విద్యార్థులు, విద్యావంతుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో 42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం జేఏసీ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ నాయకులు సైదులు మాట్లాడారు. బీసీ వర్గాలు గర్వంగా జీవించేలా 42% శాతం సాధించేందుకు రాహుల్ గాంధీ కృషి చేయడం గర్వకారణం. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యుల్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ చేస్తున్న ఈ కృషికి ఉద్యోగులు, బీసీలు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. బీసీ టీచర్స్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణుడు మాట్లాడుతూ భారత జోడో యాత్రలో బీసీల పరిస్థితిని తెలుసుకున్న రాహుల్ గాంధీ కాంగ్రెస్అధికారంలో ఉన్న తెలంగాణలో వారికి 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. బీసీ టీచర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని రాహుల్ గాంధీ చెప్పడం అభినందనీయం అన్నారు.
ఏ కేంద్ర మంత్రిత్వ శాఖలో కూడా 10శాతం బీసీ ఉద్యోగులు లేరని చెప్పారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం ఆగదన్నారు. బీసీ ఫెడరేషన్ ప్రెసిడెంట్ చిన్న రాములు ముదిరాజ్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు ఆత్మగౌరవ పోరాటం అని, అడుక్కునే పోరాటం కాదన్నారు. ఉద్యోగాల్లో, రాజకీయాల్లో, ప్రమోషన్స్ లో బీసీ లకు నష్టం జరుగుతోందన్నారు. ఈడబ్లూఎస్ రిజర్వేషన్లు తెచ్చి బీసీలను మరింత నష్టాల్లోకి నెట్టేశారని అన్నారు. బీసీ రిజర్వేషన్ అమలుకు బీజేపీ కూడా చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు.