
- 42 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను మోసం చేస్తున్నరు
మంచిర్యాల, వెలుగు : వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీసీ జెండా ఎగరడం ఖాయమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ధీమా వ్యక్తం చేశారు. మంచిర్యాలలో బుధవారం జరిగిన బహుజనుల రాజ్యాధికార సాధన సదస్సులో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ 42 శాతం బీసీ రిజర్వేషన్ల పేరుతో మోసం చేస్తోందని విమర్శించారు.
బీసీల మీద నిజంగానే ప్రేమ ఉంటే కేబినెట్‌లో 9 మంత్రి పదవులు, 50 శాతం కార్పొరేషన్ చైర్మన్ పదవులు బీసీలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల పేరిట అగ్రకుల పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. అగ్రకులాలంతా ఏకమై రాత్రికి రాత్రి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తెచ్చుకొని బీసీలకు అన్యాయం చేశారన్నారు. తెలంగాణలో బీసీ ప్రభుత్వం రాగానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను సవరిస్తామన్నారు.
బీసీల కోసం త్వరలోనే రాజకీయ పార్టీ రానుందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఐదు జనరల్ స్థానాల్లో బీసీలను ఎమ్మెల్యేలుగా గెలిపించుకుంటామని చెప్పారు. మంచిర్యాలలో బీసీ సదస్సు జరగకుండా, మీటింగ్ హాల్ ఇవ్వకుండా ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు.
సదస్సులో బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా ఇన్‌చార్జి మహేశ్‌వర్మ, కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుదగాని హరిశంకర్‌గౌడ్, కో ఆర్డినేటర్లు వట్టె జానయ్య యాదవ్, బందారపు నర్సయ్యగౌడ్, బుస్సాపూర్ శంకర్, జడ్పీ మాజీ చైర్మన్ చుంచు ఊషన్న, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గాజుల ముఖేశ్‌గౌడ్ పాల్గొన్నారు.