మహమ్మారి.. మళ్ళొస్తదేమో జర భద్రం

మహమ్మారి.. మళ్ళొస్తదేమో జర భద్రం

ఎక్కడ చూసినా గుంపులు. వీకెండ్‌‌ పార్టీలు. పెద్ద ఎత్తున ఫంక్షన్లు. ఎక్కడా ‘నో’ సోషల్ డిస్టెన్సింగ్‌‌. కనిపించని మాస్క్‌‌లు. కరోనా సెకండ్‌‌ వేవ్‌‌ పోయిందనే అపోహలో జనం. దీంతో చాపకింద నీరులా పాకుతోంది కరోనా మహమ్మారి. వారం రోజులుగా కేసులు మళ్లీ పెరుగుతున్నయ్‌‌. టీకా తీసుకున్నా.. కచ్చితంగా సోషల్ డిస్టెన్సింగ్‌‌ పాటించాలని, మాస్క్‌‌, శానిటైజేషనే కరోనాను రాకుండా చేసే ఆయుధాలని చెప్తున్నారు డాక్టర్‌‌‌‌ నవోదయ. 

‘లాక్‌‌డౌన్‌‌ ఎత్తేశారు, కరోనా పోయినట్లే’ అనే ఉద్దేశంతో జనాలు జాగ్రత్తలు తీసుకోవడం మానేశారు. ‘రెండు డోసులు టీకా తీసుకున్నాను నాకేం అవుతుంది’ అని కొంతమంది మాస్క్‌‌లు తీసేస్తున్నారు. కానీ,  ఎంత నిర్లక్ష్యంగా ఉంటే.. వైరస్‌‌ అంత విజృంభిస్తోంది. కేసులు తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. వారం రోజుల్లో చనిపోయిన వారి సంఖ్య కూడా పెరిగిందని చెప్పింది డబ్ల్యూహెచ్‌‌వో. కేరళలో మళ్లీ లాక్‌‌డౌన్‌‌ కూడా పెట్టారు. వీటన్నింటికీ కారణం మనం జాగ్రత్తగా ఉండకపోవడమే. సోషల్‌‌ డిస్టెన్సింగ్‌‌ లేకుండా, మాస్క్‌‌లు పెట్టుకోకుండా నిర్లక్ష్యం వహించడమే. 

కేసులుపెరగడానికి కారణం
సోషల్‌‌ డిస్టెన్సింగ్‌‌, మాస్క్‌‌, శానిటైజేషన్‌‌ (ఎస్‌‌.ఎం.ఎస్‌‌)ను సరిగ్గా పాటించకపోవడం వల్లే కరోనా విజృంభిస్తోంది. లాక్‌‌డౌన్‌‌ ఉన్నంతకాలం కేసులు తగ్గి, తర్వాత పెరుగుతున్నాయంటేనే అర్థమైతోంది కదా.. పార్టీలు, శుభకార్యాలు, బయట తిరగడం వల్ల కేసులు పెరిగిపోతున్నాయని. కొందరి నిర్లక్ష్యం వల్ల జాగ్రత్తలు పాటిస్తున్న వాళ్లు కూడా తెలియకుండా వైరస్‌‌ బారిన పడుతున్నారు. కనీస జాగ్రత్తలు పాటిస్తూ.. ప్రతి ఒక్కరూ మాస్క్‌‌లు పెట్టుకుంటే కేసులు చాలావరకు కంట్రోల్‌ చేయొచ్చు.

వ్యాక్సిన్‌‌ తీసుకున్నా..
కరోనా వైరస్‌ రకరకాలుగా మారుతోంది. కాబట్టి వ్యాక్సిన్‌‌ తీసుకున్నా కొవిడ్‌‌ వచ్చే ఛాన్స్‌‌ ఉంది. మన జాగ్రత్తలో మనం ఉండాలి. రెండు డోసులు అయిన వాళ్లలో కాంప్లికేషన్స్‌‌ తక్కువగా ఉంటాయి. పోస్ట్ కొవిడ్‌‌ కాంప్లికేషన్స్‌‌ ఎక్కువగా ఉండవు. వ్యాక్సినేషన్‌‌లో ముందున్న దేశాల్లో మళ్లీ కేసులు పెరగడానికి కూడా కొత్త వేరియెంట్లే కారణం. దానికితోడు జనాలు సరైన జాగ్రత్తలు తీసుకోకుండా. గుంపులు గుంపులుగా తిరగడం మరో కారణం. 

పిల్లల మీద ఎఫెక్ట్‌‌ గురించి..
ప్రస్తుతం వ్యాక్సినేషన్‌‌ డ్రైవ్‌‌ జరుగుతోంది. దానివల్ల కొంతమందికి ఇమ్యూనిటీ వచ్చింది. మరి కొంతమందికి నేచురల్‌‌ ఇమ్యూనిటీ ఉంది. అయితే, 18 ఏండ్లు నిండని  వాళ్లకి ఇంకా వ్యాక్సినేషన్‌‌ అవ్వలేదు. కాబట్టి పిల్లలకు ఎక్కువ ముప్పు ఉందని, దానికి తగ్గట్లుగా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు.

సీజనలా? కరోనానా? జబ్బా?
సింప్టమ్స్‌‌ను బట్టి కరోనానా? కాదా? అనే విషయం కనుక్కోలేం. అందుకే, జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో ఒకరికి కొవిడ్‌‌ వచ్చి మిగతావాళ్లకు సింప్టమ్స్‌‌ ఉంటే కచ్చితంగా టెస్ట్‌‌ చేయించుకోవాలి. వర్షంలో తడిచి జలుబు చేస్తే ఫ్లూ అయ్యుండొచ్చు. జ్వరం, జలుబు లాంటివి రెండు మూడు రోజులు ఉంటే కచ్చితంగా టెస్ట్‌‌ చేయించుకోవాలి.

హాస్పిటల్‌‌లో ఎప్పుడు చేరాలి?
కొవిడ్‌‌ వచ్చినవాళ్లు సింప్టమ్స్‌‌ను బట్టి డాక్టర్‌‌‌‌ను కన్సల్ట్‌‌ అవ్వాలి. ఆక్సిజన్‌‌ శాచ్యురేషన్‌‌, మిగతా కాంప్లికేషన్స్‌‌ను బట్టే హాస్పిటల్‌‌లో చేరితే మంచిది. కానీ, డాక్టర్‌‌‌‌ కన్సల్టెన్సీ మాత్రం కచ్చితంగా తీసుకుని ట్రీట్‌‌మెంట్‌‌ చేయించుకోవాలి. ‘ఏదో కొత్త వేరియెంట్ అంట. కచ్చితంగా హాస్పిటల్‌‌కు వెళ్లాలంట’ అనే అనవసర టెన్షన్‌‌ పడొద్దు.

మళ్లీ వస్తుందా..
‘నాకు కొవిడ్‌‌ వచ్చిపోయింది. మళ్లీ రాదు’ అనే నిర్లక్ష్యం వద్దు. వేరియెంట్స్‌‌లో మార్పు వచ్చినప్పుడు మన ఇమ్యూనిటీ వీక్‌‌గా ఉంటే కచ్చితంగా అటాక్‌‌ అవుతుంది. 
బ్లాక్‌‌ ఫంగస్‌‌, పోస్ట్‌‌ కొవిడ్‌‌ కాంప్లికేషన్స్‌‌తో బాధపడుతున్న వాళ్లు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. షుగర్‌‌‌‌ లాంటివి షూటప్‌ అయినవాళ్లు ఎప్పటికప్పుడు మానిటర్‌‌‌‌ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

వ్యాక్సిన్‌‌ వేయించుకున్న వాళ్లలో కొందరికి కాంప్లికేషన్స్‌‌ వస్తున్నాయి. కొవిషీల్డ్‌‌ వ్యాక్సిన్‌‌ తీసుకున్నవాళ్లలో ఎప్పటెప్పట్నించో ఉన్న రుమటాయిడ్‌‌ రోగాలు తిరగబెడతాయి. కొంతమందికి బ్రెయిన్‌‌లో రక్తం గడ్డ కట్టడం, చర్మంపై ర్యాషెష్‌‌ రావడం ఉంటుంది. అలాంటప్పుడు ఆ వ్యాధులకు ట్రీట్‌‌మెంట్‌‌ తీసుకుని, అంతా బాగుందనే విషయం నిర్ధారణ అయ్యాకే సెకండ్‌‌ డోస్‌‌  వేయించుకోవాలి. ఐసీఎంఆర్‌‌‌‌ గైడ్‌‌లైన్స్‌‌ ప్రకారం కొవిషీల్డ్‌‌ ఫస్ట్‌‌ డోస్‌‌కు, సెకండ్‌‌ డోస్‌‌కు మధ్య 14 – 16 వారాలు గ్యాప్‌‌ ఉండాలి. కొవాగ్జిన్‌‌కు 4 వారాలు ఉండాలి. ఒకవేళ ఫస్ట్ డోస్‌‌ అయ్యాక వైరస్‌‌ బారిన పడితే వైరస్‌‌ డిటెక్ట్‌‌ అయిన రోజు నుంచి 14 వారాల తర్వాత  సెకండ్‌‌ డోస్‌‌  తీసుకోవాలి. అదే కొవాగ్జిన్‌‌ అయితే 4 వారాల తర్వాత తీసుకుంటే బెటర్‌‌‌‌. 
- డాక్టర్‌‌‌‌ నవోదయ, జనరల్‌‌ ఫిజిషియన్‌‌, కేర్‌‌‌‌ హాస్పిటల్‌‌,  హైదరాబాద్‌‌

సర్జికల్ మాస్క్‌‌ మినిమమ్‌‌ 8 గంటలు మాత్రమే పెట్టుకోవాలి. మ్యాగ్జిమమ్‌‌ ఒక రోజు మాత్రమే. రెండు, మూడు రోజులు వాడితే పనికిరాదు. దానివల్ల కొత్త ఇన్ఫెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉంది. 
తుమ్మినా, తడి అయినా సర్జికల్‌‌ మాస్క్‌‌ను వెంటనే మార్చాలి. 
మాస్క్‌‌ పెట్టుకోవడం కొత్త కాబట్టి అప్పుడప్పుడూ తలనొప్పి వస్తుంది. అంతేకాని, మాస్క్‌‌ వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్‌‌ రావు. 
క్లోజ్డ్‌‌ ప్లేస్‌‌ల్లో వర్క్‌‌ చేసేవాళ్లు ఫిష్ట్స్‌‌ ప్రకారం, జాగ్రత్తలు తీసుకుంటూ పనిచేయాలి. మాస్క్‌‌ అస్సలు తీయకూడదు.