పులులే కాదు.. అలిపిరిలో ఎలుగుబంట్లు కూడా తిరుగుతున్నాయి

పులులే కాదు.. అలిపిరిలో ఎలుగుబంట్లు కూడా తిరుగుతున్నాయి

తిరుమలలో కాలినడకన భక్తులకు జంతువుల బెడద తప్పడం లేదు. ఇప్పటికే చిరుత సంచారంతో భక్తులు భయంగా భయంగా ఒక్కో మెట్టు ఎక్కుతుండగా.. తాజాగా నడకమార్గంలో ఎలుగుబంటి హల్ చల్ చేసింది. ఆగస్టు 14వ తేదీ  ఉదయం శ్రీవారి మెట్టు నడక మార్గంలో భక్తులకు ఎలుగుబంటి కనిపించింది. ఎలుగును చూడగానే భయంతో పరుగులు పెట్టారు. 2000 మెట్టు దగ్గరకు వెళ్లాక ఎలుగు బంటి కనిపించిందని భక్తులు తెలిపారు.  ఈ విషయాన్ని అధికారులకు తెలియజేశారు. దీంతో అలర్ట్‌ అయిన అధికారులు ఎలుగు బంటి కోసం గాలిస్తున్నారు. భక్తులు భయపడకుండా ముందుసాగాలని..పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులు చెబుతున్నారు

తిరుమల కాలినడక మార్గంలో ఆగస్టు 13వ తేదీ  అర్థరాత్రి ఓ చిరుత బోనులో చిక్కింది. చిన్నారి లక్షితను చంపేసిన చిరుత అదే కావచ్చని అధికారులు భావిస్తున్నారు. దాన్ని తిరుపతి జూకి తరలించారు. అక్కడ దానికి బ్లడ్ శాంపిల్ టెస్టులు చేసి.. చిన్నారిని చంపిన చిరుతపులి అదా, కాదా అన్నది తేల్చనున్నారు. ఇలాంటి సమయంలో మరో చిరుతపులి కనిపించిందనే ప్రచారం ఆందోళన కలిగిస్తోంది. ఆగస్టు 14వ తేదీన  మరో చిరుత కనిపించిందని భక్తులు తెలిపారు.  అలిపిరి నడక మార్గంలోని నామాల గవి ప్రాంతంలో వెళ్తున్న భక్తులకు చిరుత కనిపించింది. దీంతో వారు కేకలు వేస్తూ పరుగులు తీశారు. ఇప్పటికైతే చిరుత అక్కడ్నుంచి వెళ్లిపోయింది. కానీ మళ్లీ ఆ చిరుత వచ్చి ఎక్కడ్నుంచి వస్తుందో, దాడి చేస్తుందేమోనన్న భయం ఇప్పటికీ అక్కడున్న వారిని వెంటాడుతోంది.

చిరుతల కోసం తిరుమలలో  మొత్తం నాలుగు ప్రాంతాల్లో బోనులను ఏర్పాటు చేశారు. ఆగస్టు 13వ తేదీ  కాలినడక మార్గాల్లో ఐదు ప్రదేశాల్లో అధికారులు 5 చిరుతపులుల పాద ముద్రలను గుర్తించారు. దీంతో  కాలినడక మార్గాల్లో ఐదు పులులు తిరుగుతున్నాయని అధికారులు తెలిపారు.  ఆ క్రమంలోనే.. ఈ బోన్లు ఏర్పాట్లు చేశారు. అర్థరాత్రి ఒకపులి  ఆల్రెడీ చిక్కింది. మిగతా 4 చిరుతల కోసం వేటాడుతున్నారు.  పులులను ట్రాక్ చేసేందుకు తిరుమల నడక మార్గంలో చాలా చోట్ల ట్రాకింగ్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. సుమారు 500వరకు కెమెరాలు ఏర్పాటు చేసినట్టు సమాచారం.