- ట్యాంక్ బంద్ దగ్గర ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరవాసులతోపాటు పర్యాటకులకు ఎంతో ఇష్టమైన ట్యాంక్ బండ్ పరిసరాలను మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీని రంగంలోకి దించింది. హుస్సేన్‌సాగర్ అడుగున పేరుకుపోయిన పూడిక, కలుపు మొక్కలను తొలగించేందుకు హెచ్ఎండీఏ అధికారులు రూ. 2.7 కోట్లతో అత్యాధునిక ‘అంఫిబియస్ ఎక్స్కవేటర్’ను అందుబాటులోకి తెచ్చారు. సోమవారం ట్యాంక్ బండ్ వద్ద జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ వాహనాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌కు వచ్చే పర్యాటకులు ట్యాంక్ బండ్‌కు తప్పక వస్తారని, వారికి మెరుగైన వాతావరణం కల్పించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందన్నారు. ముఖ్యంగా ట్యాంక్ బండ్ అడుగున పేరుకుపోయిన పూడిక తీయడం, కలుపు మొక్కలు ఏరివేయడం, వ్యర్థాలు తొలగించడం ద్వారా సాగర్ తీరం మరింత అందంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది సాగర్ పరిరక్షణకు పడే బలమైన ముందడుగు అని తెలిపారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, హెచ్‌ఎండీఏ జేఎంసీ వెంకన్న, చీఫ్ ఇంజినీర్ రవీందర్, అప్పారావు పాల్గొన్నారు.
ఇవీ ప్రత్యేకతలు..
ఈ వాహనం చెరువు నీటిపై తేలుతూనే అడుగున పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు తీస్తుంది. ఒక్కో షిఫ్ట్‌కు దాదాపు 2 వేల క్యూబిక్ మీటర్ల పూడిక తీసే సామర్థ్యం గల ఈ యంత్రం.. చెరువులు, మడుగు ప్రాంతాల్లో డీసిల్టింగ్, డ్రెడ్జింగ్ పనులను మరింత ఈజీ చేయనుంది.
పాత చెరువుల పునరుద్ధరణతో పాటు వినాయక చవితి, బతుకమ్మ, ఛట్ పూజ వంటి పండుగల వేళ విగ్రహ నిమజ్జన కార్యక్రమాలను సాఫీగా నిర్వహించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఈ యంత్రం పనితీరును పర్యవేక్షించేందుకు ప్రతి షిఫ్ట్‌లో ఒక నైపుణ్యం గల ఆపరేటర్, ఒక సెమీ-స్కిల్డ్ ఆపరేటర్ విధులు నిర్వహిస్తారన్నారు.
