పనులు లేక.. బిచ్చగాళ్లమైపోయాం

పనులు లేక.. బిచ్చగాళ్లమైపోయాం
  • ఢిల్లీ ఆటోవాలాల ఆవేదన
  •  తినేందుకు తిండిలేక, అద్దె కట్టలేక ఇబ్బందులు

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వల్ల దేశంలోని చాలా మంది ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారు. వ్యాధి బారిన పడుతున్న వారు వేలల్లో అయితే.. వ్యాధిని అరికట్టేందుకు విధించిన లాక్‌డౌన్‌ వల్ల ఇబ్బందులు పడుతున్న వారు లక్షల్లో ఉన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా అన్ని మూతపడటంతో రోజువారి కూలీలు, ట్యాక్సీ డ్రైవర్లు, ఆటో వాలాలు పనిలేక, తినేందుకు తిండిలేక ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో రోజు ఆటో నడిపితే కానీ పూట గడవని డ్రైవర్లు తాము చాలా మంది ఇబ్బందులు పడుతున్నామని, తినేందుకు తిండి కూడా లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనిలేక చేతిలో డబ్బులు లేవని, దాతలు ఇస్తున్న అన్నం తెచ్చి కుటుంబాన్ని పోషించుకుంటున్నామని అంటున్నారు. ఇంటి అద్దె కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. “ నా కుటుంబానికి రోజు తిండికూడా పెట్టలేకపోతున్నాను. డబ్బులు లేక అడ్డుకునే వాడిలా బతుకుతున్నాను. బయటికి వెళ్తే పోలీసులు కొడుతున్నారు. దగ్గర్లో ఉన్న స్కూల్‌ నుంచి అన్నం తెచ్చి పిల్లలకు పెడుతున్నాను. వాళ్లను పోషించేందుకు నా దగ్గర డబ్బు లేదు” అని ఢిల్లీలో ఆటో నడిపే అన్సారీ అన్నారు. “ ఇంటి అద్దె కట్టేందుకు డబ్బులు లేవు. మా ఓనర్‌‌కు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. ఇన్ని రోజులు ఖాళీగా ఇంట్లో కూర్చున్నాను. ఏదైనా ఎమర్జెన్సీ కేసులు వస్తే వాళ్లను హాస్పిటల్‌కు తరలిస్తూ కొంచెం డబ్బులు సంపాదిస్తున్నాను” అని ప్రమోద్‌ అనే ఆటో డ్రైవర్‌‌ అన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన కేంద్ర ప్రభుత్వం పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌ను ఆపేసింది. కేవలం ఎమర్జెన్సీ పరిధిలోకి వచ్చే వెహికిల్స్‌ మాత్రమే రోడ్డుమీదకు అనుమతిస్తున్నారు. దీంతో ఆటో నడిపే వారు, ట్యాక్సీ డ్రైవర్లు తమ ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది.