- 44 ఏండ్లుగా ప్రతి ఏరియా ఆస్పత్రిలో100 బెడ్లే
- కరోనా టైంలో పెంచుతామని ప్రకటన
- నేటికీ ఆ విషయాన్ని పట్టించుకోని ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఏరియా హాస్పిటల్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో సరిపడా బెడ్లు లేక పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. ఉన్నవాటిలో సగానికి పైగా గర్భిణులకే కేటాయిస్తున్నారు. మిగిలినవి ఇతర పేషెంట్లకు సరిపోవడం లేదు. కరోనా టైంలో బెడ్ల సంఖ్య పెంచుతామని ప్రకటించిన ప్రభుత్వం..తర్వాత ఆ విషయాన్ని గాలికి వదిలేసింది. గ్రేటర్ వ్యాప్తంగా 5 ఏరియా ఆస్పత్రులు, 7 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ఇందులో గోల్కొండ, నాంపల్లి, మలక్ పేట ఏరియా హాస్పిటల్స్ని 44 ఏండ్ల కింద 100 బెడ్లతో ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సంఖ్య పెరగలేదు.
20 ఏండ్ల కింద..
20 ఏండ్ల కింద వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిని 100, కొండాపూర్ జిల్లా ఆస్పత్రిని 200 బెడ్లతో ఏర్పాటు చేశారు. ఇక్కడ కూడా బెడ్ల సంఖ్య పెంచలేదు. పానీపురా, శ్రీరామ్ నగర్, జంగంమెట్, అంబర్పేట, డబీర్పురా, లాలాపేట్అర్బన్కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలోనూ ఇదే పరిస్థితి. ఏర్పాటు చేసినప్పటి నుంచి ఒక్కో సెంటర్లో10 బెడ్లు మాత్రమే ఉన్నాయి. బార్కాస్ కమ్యూనిటీ హెల్త్సెంటర్లో 50 బెడ్స్ ఉండగా అక్కడ కూడా పెంచలేదు. ఈ ఆస్పత్రులకు వస్తున్న ఇన్పేషెంట్లు బెడ్లు లేక టీచింగ్ ఆస్పత్రులకు వెళ్తున్నారు. కమ్యూనిటీ సెంటర్లు, ఏరియా హాస్పిటల్స్లో సౌకర్యాలు కల్పిస్తే చిన్న చిన్న జబ్బులకు పెద్దాసుపత్రుల దాకా వెళ్లే పని ఉండదని పేషెంట్లు వాపోతున్నారు.
అప్పుడు చెప్పారు కానీ..
కరోనా టైంలో ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు పేషెంట్ల తాకిడి పెరగడంతో బెడ్ల సంఖ్య పెంచుతామని అధికారులు చెప్పారు. తర్వాత ఐసోలేషన్ వార్డుల కోసం బెడ్లు తెచ్చి గోల్కొండ ఏరియా ఆస్పత్రిలో ఉంచారు. కరోనా తగ్గుముఖం పట్టడంతో వాటిని అక్కడే ఉంచారు. కొండాపూర్ జిల్లా ఆస్పత్రి మినహా ప్రస్తుతం అన్ని ఏరియా దవాఖానల్లో 100 బెడ్లే ఉన్నాయి.
డెలివరీ కేసులే ప్రయారిటీ
ప్రస్తుతం ఏరియా ఆస్పత్రులకు వస్తున్న వారిలో ఎక్కువగా గర్భిణులే ఉంటున్నారు. 4 ఏరియా, ఓ జిల్లా ఆస్పత్రుల్లో కలిపి డైలీ 100 వరకు డెలివరీలు జరుగుతున్నాయి. దీంతో వార్డుల్లోని బెడ్లను సగానికిపైగా బాలింతలకే కేటాయిస్తున్నారు. ఇవి కాకుండా డెలివరీ కేసులు వస్తాయోనని మరో10 బెడ్లను రిజర్వ్చేసి ఉంచుతున్నారు. ఆ తర్వాత మిగిలిన వాటినే ఇతర పేషెంట్లకు ఇస్తున్నారు. ఏరియా ఆస్పత్రుల్లో ఆర్థో, జనరల్ మెడిసిన్, న్యూరో, డెర్మటాలజీ తదితర డాక్టర్ల కొరత ఉంది. డైలీ 800 ఓపీలు ఉండే నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో ఒక్క జనరల్ మెడిసిన్ డాక్టర్ కూడా లేరు. ఇలా ప్రతిచోట ఏదో ఒక సమస్య ఉంది.
డైలీ 500 నుంచి 1000
ప్రతి ఏరియా ఆస్పత్రికి డైలీ 500 నుంచి 1000 వరకు ఓపీలు వస్తుండగా వీటిలో అడ్మిషన్లు అవసరమున్న వారిని సిబ్బంది వేరే ఆస్పత్రులకు రెఫర్చేస్తున్నారు. ఇక అర్బన్కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కేవలం ఓపీ సేవలే అందుతున్నాయి. ప్రతిచోట 10బెడ్లు ఉన్నప్పటికీ అడ్మిషన్లు ఎక్కువగా ఉండట్లేదు.
నాంపల్లిలో మిగతావాళ్లను పట్టించుకోరా?
నాంపల్లి ఏరియా ఆస్పత్రిలో డెలివరీ కేసులను తప్ప మిగతా పేషెంట్లను అసలు పట్టించుకోవడం లేదు. ఏ సమస్యతో వెళ్లినా సరైన స్పందన ఉండట్లేదు. వానాకాలం వచ్చినా కూడా ఇక్కడ కనీసం జనరల్ మెడిసిన్ డాక్టర్ లేడంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలె. ఇక్కడ్నే అన్ని రకాల ఉంటే వేరే చోటికి పోయే అవసరం ఉండదు. ఉన్నవాటిలో 80 డెలివరీ కేసులకు పోతే మిగతావారి పరిస్థితి ఏంది. ఆస్పత్రి అన్నప్పుడు అందరినీ పట్టించుకోవాలె.
- ఆకుల గోవర్ధన్, బీజేపీ లీడర్
బెడ్ల సంఖ్య పెంచకపోతే ఎట్లా?
చిన్న హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినా జనం ఉస్మానియాకి వెళ్తున్నారు. మా చిన్నప్పటి నుంచి గోల్కొండ ఏరియా ఆస్పత్రిలో బెడ్ల సంఖ్య పెంచలేదు. రోజురోజుకు పేషెంట్ల తాకిడి పెరుగుతున్నా పెంచకపోతే ఎట్లా. కరోనా టైంలో కూడా పట్టించుకోలేదు.
- కె.చంటిబాబు, కాంగ్రెస్ లీడర్, కార్వాన్
త్వరలోనే బెడ్లు పెంచుతం
గోల్కొండ, మలక్పేట ఏరియా ఆస్పత్రుల్లో త్వరలో బెడ్లు పెంచుతాం. కరోనా టైంలోనే బెడ్లు తెచ్చి ఉంచాం. ఎక్స్ ట్రా బెడ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిని అవసరమైతే ఆరోగ్యశ్రీ పేషెంట్ల కోసం వాడుతున్నాం. పేషెంట్లకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
- డాక్టర్ సునీత, డీసీహెచ్ఎస్, హైదరాబాద్
