- ఎండలు, పెళ్లిళ్లు, ఐపీఎల్‌తో ఏప్రిల్‌లో ఫుల్ డిమాండ్
- ప్రస్తుతం రోజుకు 3 లక్షల కేసుల బీర్ల అమ్మకాలు
- 2 లక్షల కేసులకు మించి సప్లై చేయలేక డిపోల్లో
- ‘రేషన్’ పద్ధతి అమలు చేస్తున్న ఎక్సైజ్ శాఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భానుడి భగభగలకు ఐపీఎల్ క్రికెట్ ఫీవర్, పెళ్లిళ్ల సందడి తోడవ్వడంతో బీర్ల విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మందుబాబులు చల్లని బీర్ల కోసం వైన్ షాపుల ముందు క్యూ కడుతున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ నెలలోనే ఏకంగా 6 కోట్ల బీర్లు తాగేశారు. ప్రస్తుతం రోజుకు 3 లక్షల కేసుల బీర్లకు డిమాండ్ పెరగగా, ఉత్పత్తి ఆ స్థాయిలో లేకపోవడంతో సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
రోజుకు 2 లక్షల కేసులకు మించి సరఫరా చేయలేని పరిస్థితి నెలకొనడంతో.. ఎక్సైజ్ శాఖ డిపోల వారీగా ‘రేషన్’ విధానాన్ని అమలు చేస్తున్నది. గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు ఏ స్థాయిలో పెరిగాయో అర్థమవుతోంది. నిరుడు ఏప్రిల్‌లో 41.39 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆ సంఖ్య ఏకంగా 50.05 లక్షల కేసులకు (6 కోట్ల బీర్లు) చేరింది. కేవలం ఏప్రిల్‌లోనే కాకుండా మార్చి నెలలో కూడా ఇదే జోరు కనిపించింది. నిరుడు మార్చిలో 39.05 లక్షల కేసుల అమ్మకాలు జరగ్గా, ఈ ఏడాది మార్చిలో ఏకంగా 50.78 లక్షల కేసులు అమ్ముడై రికార్డు సృష్టించాయి. గతేడాది కంటే ఈసారి దాదాపు 11 లక్షల కేసుల అదనపు అమ్మకాలు నమోదయ్యాయి.
75 లక్షల కేసులకు చేరుతుందని అంచనా..
వేసవి తాపం మే నెలలో మరింత ముదురుతుండటంతో బీర్ల వినియోగం కూడా అదే స్థాయిలో పెరుగనున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల నుంచి రోజుకు సగటున 3 లక్షల కేసుల బీర్ల కోసం ఆర్డర్లు వస్తున్నాయి. గత మే నెలలో మొత్తం 52.17 లక్షల కేసుల విక్రయాలు జరగ్గా, ఈ సారి మే నెల ముగిసే సమయానికి ఆ డిమాండ్ ఏకంగా 75 లక్షల కేసులకు చేరుతుందని ఎక్సైజ్ శాఖ ముందస్తు అంచనా వేస్తున్నది. ఇందుకు తగ్గట్టుగా తయారీ సంస్థలు తమ ఉత్పత్తిని పెంచాలని అధికారులు ఆదేశిస్తున్నారు.
డిమాండ్ భారీగా ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో సరఫరా గండం వేధిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని బీర్ల తయారీ కేంద్రాలు రోజుకు గరిష్టంగా 2 లక్షల కేసులను మాత్రమే డిపోలకు పంపగలుగుతున్నాయి. రోజువారీ డిమాండ్ 3 లక్షల కేసులుగా ఉండటంతో.. డిపోల్లో నిల్వలు నిండుకుంటున్నాయి. ఈ కొరతను దృష్టిలో ఉంచుకొని ఎక్సైజ్ శాఖ డిపోల వద్ద రేషన్ పద్ధతిని ప్రవేశపెట్టింది. మద్యం దుకాణదారులు అడిగినన్ని కేసులు ఇవ్వకుండా, ఉన్న స్టాక్‌ను అందరికీ సమానంగా పంపిణీ చేసేలా కోటాను విధిస్తున్నది.
ముఖ్యంగా పాపులర్ బ్రాండ్ల విషయంలో ఈ రేషన్ పద్ధతిని కఠినంగా అమలు చేస్తున్నారు. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రతకు ఉపశమనం కోసం, సాయంత్రం వేళ ఐపీఎల్ మ్యాచుల కిక్కు కోసం బీర్ల వినియోగం విపరీతంగా పెరిగింది. వీటికి తోడు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివాహ ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో ఫంక్షన్ హాల్స్ లో కూడా బీర్ల వరద పారుతోంది. ఈ కారణాలతో సాధారణ రోజుల కంటే అమ్మకాలు భారీగా పెరిగి ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి.
