భారీగా పెరిగిన బీర్ల అమ్మకాలు

భారీగా పెరిగిన బీర్ల అమ్మకాలు
  • తెలంగాణలో 14 లిక్కర్.. 6 బీర్ల కంపెనీలు

హైదరాబాద్: ఓ వైపు కరోనా విస్తరిస్తున్నా.. బీర్ల అమ్మకాల జోరు ఏ మాత్రం తగ్గకపోగా మరింత పెరుగుతోంది. గత ఏడాదిని మించి అమ్మకాలు జరుగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కేసులు మరింత పెరుగుతున్న నేపధ్యంలో అమ్మకాలు తగ్గుతాయనుకుంటే సీన్ రివర్స్ అవుతోంది. గత ఏడాది మార్చిలో 26.35 లక్షల కేసుల అమ్మకాలు జరిగితే.. ఈ ఏడాది అంటే 2021 మార్చి నెలలో ఏకంగా 29.59 లక్షల కేసుల అమ్మకాలు జరిగాయి. 
బీర్ల అమ్మకాల్లో కరీంనగర్ జిల్లా టాప్

బీర్ల అమ్మకాలలో ఎక్కువ కేసుల బీర్లు తాగిన జిల్లాగా కరీంనగర్ అగ్రస్థానంలో నిలిచింది. కరీంనగర్ జిల్లాలో 2 లక్షల 19 వేల 186 కేసులు అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ రికార్డులు చెబుతున్నాయి. ఎండకాలం కావడంతో బీర్ల అమ్మకాలు పెరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు. ఎండలు పెరుగుతున్నందున మందు బాబులు చల్లదనం కోసం బీర్లు ఎక్కువగా తాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన వచ్చే మే నెల నాటికి బీర్ల అమ్మకాలు మరింత భారీగా పెరిగే అవకాశం ఉందని డిస్టిలరీ కంపెనీల అంచనా. గత ఏడాది కరోనా టైమ్ లో ఘోరంగా పడిపోయిన బీర్ల అమ్మకాలు గత ఫిబ్రవరి తర్వాత పెరుగుదల ప్రారంభమైంది.గత మార్చి నెల నుంచి ఊపందుకున్నాయి. దీంతో 2021 మార్చి నెలలో  రికార్డ్ స్థాయిలో బీర్ల అమ్మకాలు జరిగాయి. లిక్కర్ తో పోటీపడుతుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. గత మార్చి నెలలో 30 .15 లక్షల లిక్కర్( హార్డ్) కేసులు అమ్ముడైతే..29.59 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. 29.59 లక్షల కేసుల బీర్ల అమ్మకాల ద్వారా 125 కోట్ల 55 లక్షలు రూపాయలు వసూలయ్యాయి. 2020 మార్చిలో 26.35 లక్షల కేసుల గాను 105 కోట్ల 40 లక్షల వసూలయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో 14 లిక్కర్ కంపెనీలు, ఆరు బీర్ల కంపెనీలు ఫుల్ డిమాండ్ తో నడుస్తున్నాయి.