ఓట్ల కోసం బాబు భజన!.. పోటాపోటీగా కామెంట్లు

ఓట్ల కోసం బాబు భజన!.. పోటాపోటీగా కామెంట్లు
  • కేసీఆర్​ది ఓ లెక్క.. లోకల్ బీఆర్ఎస్ లీడర్లది మరో లెక్క
  • అరెస్ట్ అక్రమమంటూ ఉమ్మడి జిల్లాలో ర్యాలీలు
  • అడ్డుకోవద్దని పోలీసులకు మౌఖిక ఆదేశాలు

ఖమ్మం, వెలుగు:  ఏపీలో మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్ట్​ విషయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని బీఆర్ఎస్​ నేతల తీరు చర్చనీయాంశమవుతున్నది. బాబు అరెస్ట్ ను ఖండించేందుకు ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారు. అరెస్ట్ అక్రమమంటూ ఒకవైపు స్టేట్ మెంట్లు ఇస్తూనే, ఆయనకు మద్దతుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు తీసేందుకు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. మరికొందరు నేతలు వెనుక ఉండి మరీ బాబు అరెస్ట్ కు నిరసనగా చేపట్టే ర్యాలీలను సక్సెస్​ చేసేందుకు ముందస్తు సమావేశాలు పెట్టిస్తున్నారు. ఇక పోలీసుల వైపు నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు, వారికి కూడా   మౌఖిక ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా తాము చేపట్టే కార్యక్రమాలకు పోలీసుల అనుమతుల విషయంలో గానీ, చేసే కామెంట్ల గురించి గానీ అధినేతకు కోపం రాకుండా ముందస్తు గానే అన్ని జాగ్రత్తలు తీసుకొని రంగంలోకి దిగినట్టు ప్రచారం జరుగుతోంది. సోషల్​ మీడియాలో రిలీజ్​ చేసే స్టేట్ మెంట్ల దగ్గర నుంచి, తాము చేసే వ్యాఖ్యల వరకు ఒక ప్లాన్​ ప్రకారమే వ్యవహరిస్తున్నారు. ఖమ్మంలో జిల్లాలో పెద్దసంఖ్యలో ఉన్న ఓ వర్గం ఓట్ల కోసమే బీఆర్ఎస్​ లీడర్లు బాబు భజన చేస్తున్నారనే చర్చ నడుస్తోంది.

పోటాపోటీగా కామెంట్లు 

ఓవైపు  తమ అధినేత కేసీఆర్​సందర్భం వచ్చినప్పుడల్లా చంద్రబాబును ఉతికి ఆరేస్తుండగా, తాజాగా బాబు అరెస్ట్ ను ఖండించేందుకు రూలింగ్​పార్టీ నాయకులు ఒకరితో ఒకరు పోటీ పడ్తుండడం ఆసక్తిగా మారింది. ఇప్పటికే మంత్రి అజయ్​మొదలుకొని పలువురు ఎమ్మెల్యేలు, కొందరు జిల్లా స్థాయి నాయకులు డైరెక్ట్  స్టెట్ మెంట్లు ఇవ్వగా, మరికొందరు పత్రికా ప్రకటనలు విడుదల చేశారు. ఇంకొందరు నేతలు ఆయా నియోజకవర్గాల్లో చేపట్టిన ర్యాలీలకు పోలీసుల పర్మిషన్లు ఇప్పించారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దు అంటూ ముఖ్య నేతలే మౌఖిక  ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఖమ్మంలో గత వారం 'వీ సపోర్ట్ సీబీఎన్'​ పేరుతో చంద్రబాబు ఫాలోవర్స్​ భారీ ర్యాలీ నిర్వహించారు. పార్టీలకు అతీతంగా జరిగిన ఈ ర్యాలీలో కొందరు బీఆర్ఎస్​ నేతలు కూడా పాల్గొన్నారు. అంతకు ముందు రోజు జరిగిన సన్నాహక సమావేశానికి పలువురు కార్పొరేటర్లు, ఇతర నాయకులు అటెండ్​ అయ్యారు. ఆ తర్వాత పలు నియోజకవర్గాల్లో బాబు అరెస్ట్ పై నిరసన ర్యాలీలు జరిగాయి.  ఏ కార్యక్రమానికి కూడా పోలీసులు ఆటంకం కల్పించలేదు.

స్వయంగా ఖండించిన పువ్వాడ

ఇటీవల మమత మెడికల్ కాలేజీ సిల్వర్ జూబ్లీ కార్యక్రమంలో మాట్లాడిన సమయంలో చంద్రబాబు అరెస్ట్ ను మంత్రి పువ్వాడ అజయ్​ ఖండించారు. అంతకు ముందు, ఆ తర్వాత పలువురు బీఆర్ఎస్​ ఎమ్మెల్యేలు కూడా ఇదే తరహాలో స్టేట్ మెంట్లు రిలీజ్​ చేశారు. సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, వనమా వెంకటేశ్వరరావు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొందరు పొంగులేటి అనుచరులు చంద్రబాబుకు అనుకూలంగా ప్రకటనలు చేశారు. ఏపీ రాష్ట్రాన్ని ఆనుకొని సరిహద్దుగా ఖమ్మం జిల్లా ఉండడంతో అక్కడి రాజకీయాల ప్రభావం ఉమ్మడి జిల్లా పరిధిలో కనిపిస్తుంది. చాలా నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి బలమైన కేడర్​ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా పరిధిలోనే రెండు సీట్లను తెలుగుదేశం పార్టీ గెల్చుకుంది. ఆ తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు బీఆర్ఎస్​ లో చేరడంతో అసెంబ్లీలో టీడీపీ ఖాళీ అయింది. ఇప్పటికీ కార్యకర్తల బలంతో పాటు ఉమ్మడి జిల్లాలో ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న ఒక సామాజికవర్గాన్ని దగ్గర చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఓట్ల కోసం బీఆర్ఎస్​ నేతలు బాబు భజన ఎత్తుకున్నారన్న చర్చ జరుగుతోంది.