కోల్కతా: అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయర్ లియోనల్ మెస్సీ పర్యటన వేళ శనివారం కోల్ కతాలోని స్టేడియంలో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనకు బాధ్యుడిగా చేస్తూ ఈవెంట్ మేనేజర్ శతద్రు దత్తాకు బెయిల్ లభించలేదు. పోలీసులు అతడిని14 రోజుల కస్టడీకి తీసుకున్నారు. ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’ లో భాగంగా మెస్సీ తొలుత కోల్ కతాకు వచ్చాడు. అక్కడి సాల్ట్ లేక్ స్టేడియంలో చెప్పినదాని కంటే తక్కువ సమయం గడపడంతో అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. దీంతో స్టేడియంలోని సీసాలు, ప్లాస్టిక్ కుర్చీలను మైదానంలోకి విసిరేశారు.
ఫలితంగా అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. అనంతరం పోలీసులు నిరసనకారులను చెదరగొట్టారు. ఈ ఘటనకు సంబంధించి ఈవెంట్ ఆర్గనైజర్ శతద్రు దత్తాను పోలీసులు కోల్ కతాలోని ఎయిర్ పోర్టులో అరెస్టు చేశారు. అనంతరం బిధాన్నగర్ కోర్టులోని అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. ఈ క్రమంలో శతద్రుదత్తా న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో తన క్లయింట్ ను అక్రమంగా ఇరిక్కించారని ఆరోపించారు.
మెస్సీ ముందు తమ ప్రతిష్టను దిగజార్చేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారని తెలిపారు. నిర్వాహకులు సరిగ్గా ఏర్పాట్లు చేయలేదని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు చెప్పారు.
