ఒకే కొనుగోలు పాలసీ తేవాలె

ఒకే కొనుగోలు పాలసీ తేవాలె
  • పార్లమెంట్​లో టీఆర్ఎస్ ఎంపీల డిమాండ్

న్యూఢిల్లీ, వెలుగు: వడ్ల కొనుగోలు విషయంలో ‘నేషనల్ ఫుడ్ గ్రెయిన్స్ ప్రొక్యూర్‌‌‌‌‌‌‌‌మెంట్ పాలసీని తీసుకురావాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. కొనుగోళ్ల విషయంలో రాష్ట్రాల మధ్య వివక్ష ఉండకూడదని, ఒకే దేశం- ఒకే పద్ధతిని ప్రకటించాలన్నారు. ఏడాదికి ఒకేసారి రాష్ట్రాలవారీగా టార్గెట్స్ పెట్టాలని, దీన్ని బట్టి తెలంగాణతోపాటు అన్ని రాష్ట్రాలు సాగుపై ప్లాన్ చేసుకుంటాయని చెప్పారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందంటూ టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ లోపల, బయట ఆందోళన చేపట్టారు. ప్లకార్డులతో నిరసన తెలిపారు. పార్లమెంట్ వాయిదా పడ్డ తర్వాత తెలంగాణ భవన్‌‌‌‌లో మీడియాతో మాట్లాడారు.

తెలంగాణలో వడ్ల సేకరణ విషయంలో దుర్భరమైన పరిస్థితి ఉందని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవ రావు అన్నారు. ఏడాది టార్గెట్స్‌‌‌‌ను కేంద్రం ఇవ్వడం లేదని, గతంలో కేంద్రం ఇచ్చిన టార్గెట్స్‌‌‌‌ను, ఇప్పుడు ఎంఓయూ అంటోందని ఆరోపించారు. వానాకాలం రైస్‌‌‌‌ను కేంద్రం పూర్తిగా సేకరించాలని డిమాండ్ చేశారు. ‘‘యాసంగిలో వేసే వరి పంటలో హీట్ క్లైమేట్ కారణంగా రైస్ విరిగిపోతయ్. అందువల్ల బాయిల్డ్ రైస్ రూపంలో పంట తీస్తం. క్లైమేట్‌‌‌‌పై ఎవరికైనా కంప్లైట్ చేయాలంటే దేవుడికే చేయాలి. కానీ ఆ దేవుడి అడ్రస్ తెలియదు. తెలిస్తే నేనే వెళ్లి ఫిర్యాదు చేసే వాడిని’’ అని అన్నారు. ఫుడ్ సెక్యూరిటీ లా ప్రకారం.. రాష్ట్ర అవసరాలు, సంక్షేమ పథకాలకు పోను మిగిలిన ఎక్సెస్ పంటను ఎఫ్‌‌‌‌సీఐ కొనుగోలు చేయాలని చెప్పారు.
రైతులను ఆదుకోవాలె
‘‘రాష్ట్రంలో గత మూడేళ్లలో రైతు బంధు, నీళ్లు, ఉచిత విద్యుత్, ఫార్మ్ ఇన్ పుట్స్, రైతు వేదికల ద్వారా రైతుల్లో అవగాహన కల్పిస్తూ సాగును పెంచాం. ఈ వానాకాలంలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగైంది” అని కేకే చెప్పారు. యాంటీ ఫార్మర్స్ విధానంతో బీజేపీ ముందుకుపోతోందన్నారు. అకాల వర్షంతో వడ్లు మొలకెత్తుతున్నాయని, కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. ‘‘కేసీఆర్ చేసిన తప్పేంటి? ప్రతి ఏకరానికి నీళ్లు ఇవ్వడమా? ప్రపంచలోనే అత్యధికంగా సాగు పెంచడమా? ప్రొడక్షన్ ఒకటిన్నర రెట్లు పెంచడమా?” అని ప్రశ్నించారు. తెలంగాణ నుంచి కేంద్రం పంట సేకరించడం లేదని, పంజాబ్ నుంచి కొంటోందని, ఈ వివక్ష ఉండకూదని అన్నారు.
కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వలే: నామా
పార్లమెంటులో పంట కొనుగోళ్లపై వాయిదా తీర్మానాలు ఇస్తే స్పీకర్‌‌‌‌ తిరస్కరించారని ఎంపీ నామా నాగేశ్వర్ రావు అన్నారు. కనీసం అగ్రి చట్టాల రద్దు బిల్లుపై చర్చకు అవకాశం వస్తే తమ సమస్యను లేవనెత్తుదామని భావించినట్లు చెప్పారు. పంటల కొనుగోళ్లపై చర్చకు నిరాకరించడంతో ఆందోళన చేశామని, వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు కూడా ఏకపక్షంగా చర్చ లేకుండా ఆమోదించారన్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. రెండు నెలలుగా చర్చలు జరుపుతున్నామని, కానీ కేంద్రం చేతులెత్తేసిందని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వకుండా తెలంగాణ రైతుల్ని కేంద్రం రోడ్డున పడేలా చేస్తోందన్నారు. ఢిల్లీ పర్యటనలో కేసీఆర్‌‌‌‌ కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం చేశారని చెప్పారు. సాగు విషయంలో తెలంగాణను, రైతులను కేంద్రం అవమానిస్తోందన్నారు. మిగతా పార్టీల ఎంపీలు కూడా తమతో కలిసి రావాలని కోరారు.