పదిహేనేళ్ల పోరాటంలో గెలిచిన డెల్ఫిన్
డీఎన్ఏ టెస్టుల రిపోర్టులతో ఊరట
ఆర్థికంగానూ దెబ్బతీశారన్న డెల్ఫిన్
ఆమె పదిహేనేళ్ల పోరాటం ఫలించింది. రాజకుటుంబానికి యువరాణిని చేసింది. ‘ఆమె నా బిడ్డ కాదు’ అని చెప్పిన మాజీ రాజే.. తన నోటితోనే ‘నా బిడ్డ’ అని ప్రకటించారు. ఇదీ, డెల్ఫిన్ బోయిల్ అనే 51 ఏళ్ల ఆర్టిస్ట్ స్టోరీ. బెల్జియం మాజీ రాజు కింగ్ ఆల్బర్ట్2కి తాను వారసురాలినంటూ పిటిషన్ వేసి కేసు గెలిచారు. డెల్ఫిన్ తన కూతురేనంటూ సోమవారం ఆల్బర్ట్ ప్రకటించారు. దీంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.
ఏంటా కేసు?
డెల్ఫిన్ తల్లి సిబిల్లీ డి సెల్యిస్ లాంగ్చాంప్స్. ఆమెదీ రాజకుటుంబమే. ఆమెతో 1966లో ప్రేమలో పడ్డారు ఆల్బర్ట్. ఇద్దరి మధ్యా ఆ బంధం 18 ఏళ్ల పాటు కొనసాగింది. నిజానికి 1959లోనే ఆల్బర్ట్ఇటలీకి చెందిన మరో రాజకుటుంబంలోని డోనా పావోలా రుఫ్ఫో డి కలాబ్రియాను పెళ్లి చేసుకున్నారు. అయినా లాంగ్చాంప్స్తో 1984 వరకు బంధాన్ని కొనసాగించారు. అప్పటికీ ఆయన ఇంకా ప్రిన్స్‌గానే కొనసాగేవారు. అయితే, తన అన్న చనిపోవడంతో 1993లో అనుకోకుండా 62 ఏళ్ల వయసులో ఆల్బర్ట్ రాజుగా బాధ్యతలు చేపట్టారు. 2005లో ఓ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చిన డెల్పిన్, ఆల్బర్ట్ తన తండ్రి అని బాంబు పేల్చారు. అప్పట్లో బెల్జియంలో అది పెద్ద చర్చకే దారి తీసింది. అయితే, తన ఆరోగ్యం బాగా లేదని చెప్పి 2013 జులైలో రాజు బాధ్యతల నుంచి ఆల్బర్ట్ తప్పుకున్నారు. తన కొడుకు ఫిలిప్‌ను రాజుగా చేశారు. ఎప్పుడైతే ఆయన రాజుగా బాధ్యతలు వదిలించుకున్నారో ఆ ఏడాదే డెల్ఫిన్ కోర్టుకెళ్లారు. ఆల్బర్ట్ తన తండ్రేనంటూ వాదించారు.
ఆర్థికంగా దెబ్బ తీశారట
చిన్నప్పటి నుంచి తన తండ్రి ఎవరో తెలియకుండానే పెరిగారట డెల్ఫిన్. అయితే, ఒకసారి తన తల్లిని గట్టిగా నిలదీస్తే ఆల్బర్ట్ తన తండ్రి అని చెప్పిందట. దీంతో తొలిసారిగా 2005లో డెల్ఫిన్ నోరు విప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆల్బర్ట్ తన తండ్రి అని చెప్పారు. అప్పటి నుంచి ఎప్పుడు ఆమె మాట్లాడినా ఆల్బర్ట్, ఆ వ్యాఖ్యలను తోసిపుచ్చేవారట. అంతేకాదు, ఆమె కుటుంబాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారట. ఆమెను, ఆమె కుటుంబాన్ని ‘హై రిస్క్’ ప్రొఫైల్‌లో పెట్టించారట. 2012లో రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్, ఆమెది, ఆమె తల్లి బ్యాంక్ అకౌంట్లను అర్థంతరంగా బ్లాక్ చేసేసిందట. అంతేకాదు తన 11 ఏళ్ల కొడుకును హై రిస్క్ ప్రొఫైల్‌లో లిస్ట్ చేశారని డెల్ఫిన్ చెబుతున్నారు. హై రిస్క్ ప్రొఫైల్ లిస్టు నుంచి పేర్లను తొలగించాలంటే ‘ఆల్బర్ట్ నా తండ్రి కాదు’ అని చెప్పాలంటూ బెదిరింపులూ ఎదుర్కొన్నానని ఆమె అన్నారు. అయితే, ఆ అబద్ధం తాను చెప్పలేనని కరాఖండిగా డెల్ఫిన్ కుండ బద్దలు కొట్టేశారట. ఆ బెదిరింపులే కోర్టు గడప తొక్కే దాకా తీసుకెళ్లాయని డెల్పిన్ అంటున్నారు. ఎన్నో అడ్డంకులను దాటుకుని కేసు గెలిచానని చెప్పారు.
డీఎన్ఏ టెస్టులు
డెల్ఫిన్ తన కూతురు కాదనే చెప్పుకొచ్చారు ఆల్బర్ట్. దాదాపు ఐదేళ్ల పాటు కోర్టులో అదే మాట చెప్పారు. అయితే, 2018లో బెల్జియం కోర్టు డీఎన్ఏ టెస్టులకు ఆర్డర్ వేసింది. కోర్టు తీర్పును ఆయన అప్పీల్ చేశారు. 2019 నవంబర్‌లో ఆయన అప్పీల్‌ను కోర్టు కొట్టిపారేసింది. డీఎన్ఏ టెస్టు చేయించుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. ఉమ్మును ఇవ్వాల్సిందిగా ఆదేశించింది. లేట్ అయ్యే ప్రతి రోజుకూ 5 వేల యూరోలు (సుమారు రూ.3.9 లక్షలు) ఫైన్ చెల్లించాలని హెచ్చరించింది. దీంతో ఆయన దిగిరాక తప్పలేదు. కోర్టు ఆదేశాల ప్రకారం డీఎన్ఏ టెస్టుల కోసం ఉమ్మిని ఇచ్చారు. టెస్టుల్లో పాజిటివ్ వచ్చింది. ఇక, చేసేది లేక డెల్ఫిన్ తన కూతురేనంటూ సోమవారం ఆయనే స్వయంగా ప్రకటించారు.
మంచి మనసుతో ఒప్పుకుంటున్నా
కోర్టు విచారణలు, డీఎన్ఏ టెస్టుల తర్వాత ఆల్బర్ట్ స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఆయన లాయర్లు ప్రకటనను విడుదల చేశారు. ‘‘చట్టబద్ధమైన పితృత్వమనేది రక్తసంబంధం కావాల్సిన అవసరం లేదని కోర్టులో వాదనలు చెబుతున్నాయి. కోర్టులో జరిగిన వాదనలన్నింటినీ సవాల్ చేయొచ్చు. కానీ, చాలా బాధపెడుతున్న ఈ కోర్టు కేసులకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు మంచి మనసుతో కింగ్ ఆల్బర్ట్, డెల్ఫిన్ తన కూతురేనని ఒప్పుకుంటున్నారు’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇటు డెల్ఫిన్ తరఫు లాయర్లు కూడా ఆమె తరఫున ప్రకటన విడుదల చేశారు. ఆయన ఒప్పుకోవడంతో ఆమెకు కొంచెం ఊరట కలిగిందని పేర్కొన్నారు. అయితే, ఆల్బర్ట్ చనిపోయాక ఆయన ఎస్టేట్‌లో డెల్ఫిన్కూ వాటా వస్తుందని లీగల్ నిపుణులు చెబుతున్నారు.
