బీఆర్ఎస్​ నేతలకు ఎందుకంత భయం?.. 20 రోజులకే మాటలు జారుతున్నరు: బెల్లయ్య నాయక్​

బీఆర్ఎస్​ నేతలకు ఎందుకంత భయం?.. 20 రోజులకే మాటలు జారుతున్నరు: బెల్లయ్య నాయక్​

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన 20 రోజులకే బీఆర్ఎస్​ నేతలు మాటలు జారుతున్నారని, వారికి అంత భయం ఎందుకని పీసీసీ ఎస్టీ సెల్​ చైర్మన్​ బెల్లయ్య నాయక్​ ప్రశ్నించారు. ప్రజాపాలనలో ఆరు గ్యారెంటీల దరఖాస్తులపై కడియం శ్రీహరి లాంటి వాళ్లు నోరు జారి మాట్లాడుతున్నారని అన్నారు. గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని, కడియం అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. 

శనివారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. ప్రజలను మభ్యపెట్టేందుకు అప్లికేషన్లను తీసుకోవడం లేదని చెప్పారు. తమ ప్రభుత్వం చెట్లు, పుట్టలకు రైతుబంధు ఇవ్వదలచుకోలేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్​ ప్రభుత్వం పదేండ్లలో ఒక్క తెల్ల రేషన్​కార్డు కూడా ఇవ్వలేదన్నారు. భర్త చనిపోయిన ఒంటరి మహిళలు పింఛన్​ కోసం ఎదురు చూశారని, ఒక్కరికైనా ఇచ్చారా అని నిలదీశారు. 

కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్లు నీళ్లలో పోశారని, 200 ఏండ్లు ఉండాల్సిన డ్యాములు ఐదేండ్లకే ఎందుకు కుంగుతున్నాయని ప్రశ్నించారు. అలాంటి ప్రాజెక్టుపై రివ్యూ చేస్తే డైవర్ట్​ చేయడం ఎట్లా అవుతుందని నిలదీశారు. బీఆర్ఎస్​నేతలు పిచ్చి మాటలు బంద్​పెట్టాలని హితవు చెప్పారు. బీఆర్ఎస్​ హయాంలో ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్​లో రూ.లక్ష కోట్లపైనే అవినీతి జరిగిందని ఆయన ఆరోపించారు. 

చెరువుల పూడికతీతకు రూ.25 వేల కోట్లు కేటాయిస్తే.. కనీసం రూ.10 వేల కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రీ డిజైనింగ్​ పేరిట కోట్ల రూపాయలను వెనకేసుకున్నారని, తప్పు చేసిన వాళ్లు జైలు కెళ్లాల్సిందేనని ఆయన పేర్కొన్నారు.