- అవకతవకలు జరిగాయన్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు
బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని డబుల్ బెడ్రూం ఇండ్లను బుధవారం లక్కీ డ్రా పద్ధతిలో పంపిణీ ప్రక్రియ చేపట్టారు. స్థానిక పద్మశాలి భవనంలో సబ్ కలెక్టర్ మనోజ్, మున్సిపల్ చైర్ పర్సన్ దావ స్వాతి సమక్షంలో పంపిణీ చేపట్టారు. నిర్మాణం పూర్తయిన 108 డబుల్ బెడ్రూం ఇండ్లకు తొలుత 496 మంది అర్హులను ఎంపిక చేశారు. తాజాగా లక్కీ డ్రా ద్వారా 108 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా సబ్కలెక్టర్మాట్లాడుతూ.. ఇండ్ల కోసం 763 మంది దరఖాస్తులు చేసుకున్నారని, 496 మందితో అర్హుల జాబితాను తయారు చేసినట్టు తెలిపారు.
పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టినట్లు తెలిపారు. ఇప్పుడు ఇండ్లు రాని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చైర్ పర్సన్ దావ స్వాతి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేశ్, తహసీల్దార్ కృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ హమీద్, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ కౌన్సిలర్లు నిరసన తెలిపారు. లక్కీ డ్రాను బహిష్కరించిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు బయటికి వెళ్లిపోయారు.
