V6 News

రెండో విడత పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు

రెండో విడత పోలింగ్కు పకడ్బందీ ఏర్పాట్లు

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి నియోజకవర్గంలోని 7 మండలాల్లో ఈ నెల 14న రెండో విడత పంచాయతీ పోలింగ్​కు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్​ దీపక్​ తెలిపారు. శుక్రవారం వేమనపల్లి మండల కేంద్రంలోని పోలింగ్​మెటీరియల్ ​డిస్ట్రిబ్యూషన్ సెంటర్​ను ఆయన తనిఖీ చేశారు. పోలింగ్​సామగ్రిని పంపిణీలో పొరపాట్లు జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సిబ్బంది తమకు కేటాయించిన డిస్ట్రిబ్యూషన్​సెంటర్లలో శనివారం ఉదయం రిపోర్ట్​చేయాలన్నారు.

 వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలను పర్యవేక్షిస్తామని చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరుగుతుందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఓటర్లందరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు.  ఎంపీడీవో కుమారస్వామి తదితరులున్నారు. 

100 పడకల ఆస్పత్రితో మెరుగైన వైద్యసేవలు

చెన్నూర్, వెలుగు: ప్రజల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం వైద్య రంగాన్ని బలోపేతం చేస్తోందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. చెన్నూర్ మండల కేంద్రంలో కొనసాగుతున్న 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి నిర్మాణ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. హాస్పిటల్​పూర్తయితే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందుతాయని పేర్కొన్నారు. పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించారు. 

మరమ్మత్తు, అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నాణ్యమైన విద్యనందించాలని చెప్పారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పనులను పరిశీలించి నాణ్యతతో చేపట్టాలని పేర్కొన్నారు. మండల కేంద్రంలో అమృత్ 2.0 నిర్మాణ పనులను పరిశీలించి, ప్రతీ ఇంటికి  నిరంతరాయంగా తాగునీరందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.  

పోర్టబుల్ ఎక్స్ రే మెషీన్​ ప్రారంభం

నస్పూర్, వెలుగు:  జిల్లాలోని క్షయ వ్యాధిగ్రస్తులకు పోర్టబుల్ ఎక్స్ రే మెషీన్ అందుబాటులోకి వచ్చిందని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ లో డీఎంహెచ్​వో అనిత, ప్రోగ్రాం ఆఫీసర్​సుధాకర్ నాయక్ తో  ఆ మెషీన్​ను ప్రారంభించారు. జిల్లా ప్రజల సౌకర్యార్థం రూ.23 లక్షలతో పోర్టబుల్ ఎక్స్ రే మెషీన్​ను కొనుగోలు చేశామని, ఈ నెల 21 నుంచి సేవలందిస్తుందని చెప్పారు. జిల్లా మాస్ మీడియా అధికారి వెంకటేశ్వర్లు, కోఆర్డినేటర్​ సురేందర్, డీపీవో ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.