
- ఒకే గదిలో 40 మంది విద్యార్థుల బస
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి పట్టణం నడిబొడ్డులో ఉన్న ఎస్సీ బాయ్స్ కాలేజీ హాస్టల్ భవనం దయనీయ పరిస్థితిలో ఉంది. నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన ఈ భవనం శిథిలావస్థకు చేరి కూలిపోయే ప్రమాదంలో ఉంది. వర్షం పడిన ప్రతీసారి గదుల్లోకి నీరు వస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీస వసతులు లేని కారణంగా ఉన్న 40 మంది విద్యార్థులు కూడా ఒకే గదిలో ఇరుకుగా పడుకుంటున్నారు. వంటగది అధ్వానంగా ఉంది.
పనిచేస్తున్న సమయంలో భయంగానే గడుపుతున్నామని అక్కడి వర్కర్లు పేర్కొంటున్నారు. నెన్నెల, భీమిని, కాసిపేట, వేమనపల్లి, మందమర్రి, రెబ్బెన, ఆసిఫాబాద్, పెంచికల్పేట తదితర ప్రాంతాల ఇంటర్ విద్యార్థులు బెల్లంపల్లి ఉండి చదువుకోవాలని భావిస్తుంటారు. అయితే ఎస్సీ బాయ్స్ హాస్టల్అధ్వానంగా ఉండడంతో ఇందులో చేరేందుకు ఆసక్తి చూపడంలేదు.
120 మంది విద్యార్థులు ఉండాల్సిన చోట కేవలం 40 మంది మాత్రమే ఉన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు తమను పట్టించుకోవడంలేదని స్టూడెంట్లు వాపోతున్నారు. ఇప్పటికైనా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు స్పందించి కొత్త హాస్టల్ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.