
లండన్: ఇంగ్లండ్ టెస్టు టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆట కోసం తన అలవాటు మార్చుకున్నాడు. కాలి కండరాల (హ్యామ్‌స్ట్రింగ్) గాయం నుంచి తొందరగా కోలుకొని ఆస్ట్రేలియాతో యాషెస్ సిరీస్‌కు రెడీ అయ్యేందుకు మందు తాగడం మానేశాడు. 33 ఏండ్ల స్టోక్స్ గతేడాది ది హండ్రెడ్ టోర్నమెంట్‌లో గాయపడ్డాడు. కోలుకొని తిరిగి గ్రౌండ్‌లోకి వచ్చినప్పటికీ గతేడాది డిసెంబర్‌లో న్యూజిలాండ్‌తో మూడో టెస్ట్ సందర్భంగా గాయం మళ్లీ తిరగబెట్టడంతో సర్జరీ చేయించుకున్నాడు. దాంతో అతను చాన్నాళ్లు ఆటకు దూరం అవాల్సి వచ్చింది. తాను గతంలో మద్యం తాగడం వల్ల గాయాలపై ప్రభావం పడిందని గుర్తించి దాన్ని మానేశానని చెప్పాడు.
‘మొదటిసారి పెద్ద గాయానికి గురైన తర్వాత ఇది ఎలా జరిగిందని ఆలోచించాను. గాయం అవ్వడానికి కొన్ని రోజుల ముందు వరకు మందు తాగడం వల్లే జరిగి ఉండొచ్చని అనుకున్నా. కాబట్టి నా అలవాటును మార్చుకోవాల్సిన అవసరం ఉందని గ్రహించా. ఈ ఏడాది జనవరి 2 నుంచి ఒక్క చుక్క కూడా తాగలేదు. గాయం నుంచి కోలుకొని మళ్లీ మైదానంలోకి వచ్చే దాకా మందు ముట్టకూడదని నిర్ణయించుకున్నా’ అని స్టోక్స్ తెలిపాడు. స్టోక్స్ గురువారం నుంచి జింబాబ్వేతో జరిగే ఏకైక టెస్టులో రీఎంట్రీ ఇవ్వనున్నాడు.