- యూఎస్ ఇన్‌ఫ్లేషన్ డేటాపై ఫోకస్ పెట్టిన ఇన్వెస్టర్లు
- ప్రాఫిట్స్ బుకింగ్‌కు మొగ్గు
- 671 పాయింట్లు పడిన సెన్సెక్స్
ముంబై: వరుసగా రెండు రోజుల పాటు పెరిగిన బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు సోమవారం సెషన్‌లో భారీగా పడ్డాయి. ఫెడ్ వడ్డీ రేట్లను మార్చిలోపు తగ్గించడంపై సందేహాలు నెలకొనడంతో గ్లోబల్ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా నష్టాల్లో ట్రేడయ్యింది. యూఎస్ ఇన్‌ఫ్లేషన్ డేటా వెలువడే ముందు ఇన్వెస్టర్లు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారు.
సెన్సెక్స్ సోమవారం 671 పాయింట్లు (0.93 శాతం) తగ్గి 71,355 దగ్గర క్లోజయ్యింది. నిఫ్టీ 198 పాయింట్లు పడి 21,513 దగ్గర సెటిలయ్యింది. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లలో కూడా అమ్మకాల ఒత్తిడి కనిపించింది. బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లతో పోలిస్తే ఇవి తక్కువగా పడ్డాయి. బీఎస్‌ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.87 శాతం నష్టపోగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.36 శాతం పడింది.
బీఎస్‌ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ సోమవారం ఒక్క సెషన్‌లోనే రూ.2.9 లక్షల కోట్లు తగ్గి రూ.366.4 లక్షల కోట్లకు పడింది. ప్రస్తుతం ఇన్వెస్టర్ల దృష్టి కార్పొరేట్ రిజల్ట్స్‌పై షిఫ్ట్ అయ్యిందని ఎనలిస్టులు చెబుతున్నారు. దీనికి తోడు యూఎస్ ఇన్‌ఫ్లేషన్ డేటా గురువారం, ఇండియా ఇన్‌ఫ్లేషన్ డేటా శుక్రవారం వెలువడనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవడానికి మొగ్గు చూపారని ఎనలిస్టులు పేర్కొన్నారు.
మార్కెట్‌ను ప్రభావితం చేసిన అంశాలు..
1. నష్టాల్లో గ్లోబల్ మార్కెట్‌లు ..
షాంఘై కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్, సియోల్ మార్కెట్లు సోమవారం నష్టాల్లో కదిలాయి. లండన్,
ఫ్రాన్స్, జర్మనీ మార్కెట్‌లు కూడా రెడ్‌లో ట్రేడయ్యాయి. వీటి ప్రభావం ఇండియన్ మార్కెట్లపై పడింది. ‘చైనీస్ మార్కెట్‌లు నష్టాల్లో కదలడంతో ఏషియన్ మార్కెట్‌లు పడ్డాయి. ఇన్వెస్టర్లు యూఎస్ ఇన్‌ఫ్లేషన్ డేటా కోసం ఎదురు చూస్తున్నారు. డొమెస్టిక్‌గా కార్పొరేట్ ఎర్నింగ్స్ సీజన్ ప్రారంభం కానుంది.
ప్రస్తుత స్థాయిలోనే మార్కెట్ వాల్యుయేషన్స్ ఉండాలంటే రిజల్ట్స్ బాగుండాలి’ అని ఎనలిస్టులు పేర్కొన్నారు.
2. క్యూ3 రిజల్ట్స్ ముందు జాగ్రత్త
డిసెంబర్ క్వార్టర్ (క్యూ3) రిజల్ట్స్ వెలువడే ముందు ఇన్వెస్టర్లు జాగ్రత్తపడుతున్నారు. ఈ నెల 11 న ఇన్ఫోసిస్, టీసీఎస్ క్యూ3 రిజల్ట్స్ బయటకు రానున్నాయి. డిమాండ్ బాగోలేకపోవడంతో ఐటీ కంపెనీల రెవెన్యూ తగ్గుతుందని మార్కెట్ అంచనా వేస్తోంది. మొత్తంగా డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ అధ్వానంగా ఉండవని, కానీ క్వార్టర్ ఆన్ క్వార్టర్ చూస్తే కంపెనీల ప్రాఫిట్స్ కొంత పడొచ్చని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వినోద్ నాయర్ అన్నారు. ‘రానున్న సెషన్లలో రిజల్ట్స్‌ను దృష్టిలో పెట్టుకొని ట్రేడర్లు పొజిషన్లు తీసుకుంటారు. ఐటీ సెక్టార్ రిజల్ట్స్ మెరుగ్గా లేకపోయినా, ఇండియన్ కార్పొరేట్ కంపెనీల గ్రోత్ నిలకడగా ఉంటుంది’ అని అంచనా వేశారు.
3. రేట్ల కట్..
యూఎస్ ఫెడ్ వీలున్నంత తొందరగా వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు పోతున్నాయి. తాజా డేటా ప్రకారం, యూఎస్ లేబర్ మార్కెట్ స్ట్రాంగ్‌గా ఉంది. అన్‌ఎంప్లాయ్‌మెంట్ తగ్గింది. దీనిని బట్టి ఫెడ్ రేట్లను తగ్గించడానికి తొందర పడకపోవచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఈ నెల 11 న విడుదలయ్యే యూఎస్ ఇన్‌ఫ్లేషన్ డేటా బట్టి ఫెడ్ తీసుకోబోయే చర్యలు ఆధారపడి ఉంటాయి. రాయిటర్స్ రిపోర్ట్ ప్రకారం, ఈ ఏడాది మార్చి లోపు ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించే ఛాన్స్ 90 శాతం నుంచి 64 శాతానికి తగ్గింది.
4. జియో పొలిటికల్ టెన్షన్లు..
జియో పొలిటికల్ టెన్షన్లను మార్కెట్ గమనిస్తోంది. ఎర్ర సముద్రంలోని కమర్షియల్ షిప్‌లను హౌతి రెబల్స్ టార్గెట్ చేయడంపై, ఇజ్రాయిల్ – హమాస్ యుద్ధంపై ఇన్వెస్టర్లు ఫోకస్ పెట్టారు.
5. టెక్నికల్‌గా..
మార్కెట్ సెంటిమెంట్ మారుతోంది. నిఫ్టీ కీలక సపోర్ట్ 21,500 దగ్గర సోమవారం క్లోజయ్యిందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్ ఎనలిస్ట్ కునాల్ షా పేర్కొన్నారు. అతిపెద్ద బేరిష్ క్యాండిల్‌ను డైలీ చార్ట్‌లో ఏర్పరిచిందని చెప్పారు. ఈ బెంచ్‌మార్క్ ఇండెక్స్ 21,500 దిగువకు వస్తే 21,200 వరకు మార్కెట్ పడొచ్చని, పైన కదిలితే 21,650 వరకు పెరగొచ్చని వెల్లడించారు.
