
ముంబై: బెంచ్‌మార్క్ ఇండెక్స్‌లు వరుసగా మూడో సెషన్‌లోనూ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ మంగళవారం 220 పాయింట్లు (0.29 శాతం) పడి 75,170 దగ్గర, నిఫ్టీ 44 పాయింట్ల నష్టంతో 22,888 దగ్గర క్లోజయ్యాయి. లాభాల్లో ఓపెన్ అయినప్పటికీ ఇండెక్స్‌లు నష్టాల్లో ముగిశాయి. మార్కెట్‌లో ‘పడినప్పుడు కొనడం, పెరిగినప్పుడు అమ్మేయడం’ స్ట్రాటజీ కనిపిస్తోందని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఎలక్షన్స్ రిజల్ట్స్ ముందు వోలటాలిటీ భారీగా పెరిగిందని పేర్కొన్నారు. సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం సెషన్‌లో జీవిత కాల గరిష్టాలను టచ్ చేసినప్పటికీ, చివరి గంటలో ప్రాఫిట్ బుకింగ్ చోటు చేసుకోవడంతో నష్టపోయాయి.
సెన్సెక్స్‌లో పవర్ గ్రిడ్, ఎన్‌టీపీసీ, టెక్ మహీంద్రా, ఎయిర్‌టెల్, టాటా మోటార్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, కోటక్ బ్యాంక్, మారుతి షేర్లు మంగళవారం నష్టాల్లో కదిలాయి. ఏషియన్ పెయింట్స్, విప్రో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, హిందుస్తాన్ యూనీలివర్, బజాజ్ ఫైనాన్స్, ఎం అండ్ ఎం షేర్లు లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.09 శాతం పతనమవ్వగా, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.63 శాతం తగ్గింది. రియల్టీ, పవర్, యుటిలిటీస్, సర్వీసెస్, టెలీకమ్యూనికేషన్, ఇండస్ట్రియల్స్, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్‌లు ఎక్కువగా పడ్డాయి. ఒక్క హెల్త్‌కేర్ ఇండెక్స్ మాత్రమే లాభాల్లో ముగిసింది.