మునుగోడు గొర్రెలకు మోక్షం ఎప్పుడో ?

మునుగోడు గొర్రెలకు మోక్షం ఎప్పుడో ?

నల్గొండ, వెలుగు:మునుగోడు ఉప ఎన్నికల్లో సర్కారు ఇస్తానన్న గొర్రెలు ఎప్పుడు ఇంటికి చేరుతాయో తెలియక లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసింది. ఎన్నికలు కాగానే వెటర్నరీ డాక్టర్లతో కలిసి గొర్లు కొనుక్కునే ఏర్పాటు చేస్తామని, వారి ఖాతాల్లో వేసిన డబ్బులను వెనక్కి తీసుకోమని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఫలితాలొచ్చి నెల దాటినా ఇంతవరకు గొర్ల కొనుగోలుకు సంబంధించి ఎలాంటి గైడ్​లైన్స్ ఇవ్వకపోవడం, లబ్ధిదారుల ఖాతాలను ఫ్రీజ్ చేయడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. విసిగిపోయిన కొందరు లబ్ధిదారులు గొర్రెలు ఎప్పుడిస్తారంటూ అధికారుల మీద ఒత్తిడి తెస్తున్నారు. తట్టుకోలేక ఇప్పటికే నల్గొండ జిల్లా వెటర్నరీ ఆఫీసర్​లీవ్​లో వెళ్లగా.. పలువురు డాక్టర్లు, ఆఫీసర్లు లబ్ధిదారులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ముఖం చాటేస్తున్నారు. 

రాష్ట్ర వ్యాప్తంగా 3.50 లక్షల మంది

రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత గొర్రెల కోసం 3.50 లక్షల మంది లబ్ధిదారులు డీడీలు కట్టి ఎదురుచూస్తున్నారు. వీళ్లలో ఒక్క మునుగోడు నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులే 7,600 మంది ఉన్నారు. ఉప ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆలోచనతో ప్రభుత్వం అక్టోబర్1న మునుగోడు నియోజకవర్గంలోని గొల్లకుర్మలకు గొర్రెల పంపిణీ స్కీమ్​కోసం రూ.93 కోట్లు రిలీజ్ చేసింది. ఇందుకు అప్పటి వరకు ఉన్న  గైడ్​లైన్స్​మార్చేసి కొత్తగా డీబీటీ(డైరక్ట్​బెనిఫిట్ ట్రాన్స్ ఫర్) తెచ్చింది. దీనికింద లబ్ధిదారుల అకౌంట్​లోకి డబ్బులు రిలీజ్​చేశాక యూనిట్లు గ్రౌండింగ్ చేస్తామని ప్రకటించింది. పైలెట్ ప్రాజెక్టు కింద మునుగోడు నియోజకవర్గంలో మొదట అమలుచేసి, ఎన్నికలయ్యాక రాష్ట్రవ్యాప్తంగా డీబీటీ విధానం తెస్తామనిస్పష్టం చేసింది. కానీ ఇప్పటివరకు గొర్రెలు కొనేందుకు ఎలాంటి గైడ్​లైన్స్​ఇవ్వలేదు. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.93 కోట్లు పడి, ఇప్పటికే రెండు నెలలు పూర్తయింది. ఎన్ని కల హడావిడిలో లబ్ధిదారులు డబ్బులు ఆగం చేసుకుంటారని చెప్పి వాళ్ల ఖాతాల్లోంచి పైసలు డ్రా చేయకుండా అమౌంట్​ఫ్రీజింగ్​పెట్టారు. లబ్ధిదారులు అకౌంట్లలో డబ్బులు ఉన్నా, అసలు ప్రభుత్వానికి గొర్రెలు కొనే ఉద్దేశం ఉందో లేదో అర్థంకాక ఆందోళన చెందుతున్నారు. 

డీబీటీ విధానంపై సర్కార్​ క్లారిటీ ఇయ్యలే

డీబీటీ విధానంపైన సర్కార్​ క్లారిటీ ఇయ్యలేదని అధికారులు చెప్తున్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో పైసలు డ్రా చేయకుండా ఫ్రీజింగ్ పెట్టారు గానీ గైడ్​లైన్స్​ విషయంలోనే ఎందుకు ఆలస్యం జరుగుతోందో  చెప్పలేకపోతున్నామని అంటున్నారు. ఎలాగూ లబ్ధిదారుల అ కౌంట్లలో డబ్బులు పడ్డాయి కాబట్టి డాక్టర్లతో సంబంధం లేకుండా నేరుగా లబ్ధిదారులనే గొర్రెలు కొనుక్కోమని చెబితే ఎలాంటి గొడవ ఉండదని ఆఫీసర్లు చెప్తున్నారు. కానీ ఉన్నతాధికారులు మాత్రం వెటర్నరీ డాక్టర్లతో కలిసే గొర్రెలు కొనాలని అంటున్నారు. మరోవైపు డీబీటీ విధానం రాష్ట్రవ్యాప్తంగా అమలుచేయాలంటే సీఎం ఆమోదం తప్పనిసరి అని ఓ ఉన్నతాధికారి తెలిపారు. సీఎం ఆమోదం లభిస్తే తప్ప మునుగోడుతో సహా రాష్ట్ర వ్యాప్తంగా రెండో విడత గొర్రెలు పంపిణీ చేయడం సాధ్యం కాదని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెలు కొనాలంటే బడ్జెట్​ సమస్య ఉందని, కార్పొరేషన్లకు ఫండ్స్​ఇవ్వడంలో కొన్ని రూల్స్​కూడా అడ్డువస్తున్నాయని ఆయన వెల్లడించారు. 3 నెలలుగా జీతం తీస్కోలేకపోతున్ననేను ప్రైవేట్ కంపెనీ లో జాబ్ చేస్తున్న. గొర్రెల స్కీమ్ లో డబ్బులు వస్తాయని, నా శాలరీ అకౌంటుకి లింకు ఉన్న అకౌంట్ నంబర్ ఇచ్చిన. ప్రభుత్వం అకౌంట్ ఫ్రీజ్​ చేయడంతో గొర్రెల పైసలు రాకపోగా, 3 నెలల నుంచి నా జీతం డబ్బులు కూడా తీసుకోలేకపోతున్నా. ప్రభుత్వం త్వరగా గొర్రెలు ఇప్పించాలె.
– ఉబ్బు లింగస్వామి, చౌటుప్పల్​

సొంత డబ్బులు బ్యాంకులోనే ఆగినయ్

గొర్ల పైసలు అక్టోబర్ లో మా అకౌంట్లో వేశారు. ఖాతాలను ఫ్రీజ్​ చేయడంతో ఇప్పటికే అందులో ఉన్న మా సొంత డబ్బులు కూడా డ్రా చేసుకోలేకపోతున్నం. మా పైసలు తీసుకోవాలంటే వెటర్నరీ డిపార్ట్​మెంట్ నుంచి లెటర్ తెచ్చి ఇవ్వాలని బ్యాంకు అధికారులు చెప్తున్నరు. ఇప్పటివరకు మా గ్రామానికి గొర్రెలకు సంబంధించి అడిగేందుకు ఒక్కరంటే ఒక్క అధికారి కూడా రాలేదు. బ్యాంకులో ఉన్న డబ్బులను తీసుకొని గొర్రెలు కొనుగోలు చేసేలా పర్మిషన్ ఇవ్వాలె.
– గొరిగే సత్తయ్య, ఎంపీటీసీ తేరటుపల్లి, చండూరు మండలం