డోర్-టు-డోర్ ప్రచారం చేస్తున్న బీజేపీ కార్యకర్త హత్య

డోర్-టు-డోర్ ప్రచారం చేస్తున్న బీజేపీ కార్యకర్త హత్య

పశ్చిమ బెంగాల్‌లో దారుణం జరిగింది. ఇంటింటి ప్రచారం చేస్తున్న ఒక బీజేపీ కార్యకర్తను కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు కొట్టి చంపారు. ఆయనతో పాటు మరో ఆరుగురిపై కూడా దాడిచేసి గాయపరచారు. వచ్చే ఏప్రిల్-మే నెలల్లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీజేపీ ‘ఆర్ నోయి అన్నే’ (నో మోర్ అన్యాయం) అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా శనివారం ఉత్తర 24 పరగనాస్ జిల్లాలో డోర్-టు-డోర్ ప్రచారం నిర్వహించింది. ఆ ప్రచారం సందర్భంగా కొంతమంది బీజేపీ కార్యకర్తలు ఒక ఇంటికి వెళ్లారు. అక్కడ కొంతమంది వ్యక్తులు వీరందరిని తీవ్రంగా కొట్టారు. వెంటనే గాయపడిన వారిని మిగతా కార్యకర్తలు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఒక కార్యకర్త మరణించాడు. చనిపోయిన కార్యకర్తను సైకత్ భవాల్‌గా గుర్తించారు. ఈ దాడిలో గాయపడిన మరో ఆరుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

తృణమూల్ కాంగ్రెస్ అండతోనే కొంతమంది గూండాలు సైకత్ భవాల్‌ను చంపారని బరాక్‌పూర్ ఎంపీ అర్జున్ సింగ్ ఆరోపించారు. ఈ సంఘటనకు వ్యతిరేకంగా ఆదివారం జిల్లాలో తమ పార్టీ నిరసనను తెలియజేస్తుందని అర్జున్ సింగ్ తెలిపారు.

కాగా.. నైహతికి చెందిన టీఎంసీ ఎమ్మెల్యే పార్థా భౌమిక్ మాత్రం ఎంపీ అర్జున్ సింగ్ వాఖ్యలను తోసిపుచ్చారు. రెండు వర్గాల మధ్య పాత వివాదం వల్లే సైకత్ భవల్ మరణం సంభవించిందని.. ఈ మరణాన్ని బీజేపీ అనవసరంగా రాజకీయం చేస్తోందని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను టీఎంసీ అడ్డుకుంటుందని ఆయన అన్నారు.

ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని బరాక్‌పూర్ పోలీస్ కమిషనరేట్ జాయింట్ కమిషనర్ అజయ్ ఠాకూర్ తెలిపారు.

For More News..

క్షీణిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం

కలిసున్నప్పుడు ఓకే.. విడిపోయాక రేప్ అంటున్నారు