
కోల్‌కతా: గ్యాంగ్‌రేప్ ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీనికి బాధితురాలు, కాలేజీ యాజమాన్యానిదే బాధ్యత అన్నట్టుగా ఆమె నిందించారు. ఆదివారం నార్త్ బెంగాల్ పర్యటనకు వెళ్తూ కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మీడియాతో మమత మాట్లాడారు. హాస్టళ్లలో ఉండే మహిళా స్టూడెంట్లు, ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినోళ్లు.. హాస్టల్ రూల్స్ తప్పకుండా పాటించాలని సూచించారు.
అర్ధరాత్రి వేళల్లో బయటకు వెళ్లొద్దన్నారు. ఈ ఘటన అటవీ ప్రాంతంలో జరిగిందని తెలిపారు. ‘‘బాధితురాలు ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతున్నది. ఆమె అర్ధరాత్రి 12:30 గంటలకు బయటకు ఎలా వచ్చింది..? ప్రైవేట్ మెడికల్ కాలేజీలు తమ స్టూడెంట్ల సేఫ్టీ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి వేళల్లో బయటకు రానివ్వద్దు” అని సూచించారు.
రాత్రి వేళల్లో ఎవరెవరు ఇండ్ల నుంచి బయటకు వెళ్తున్నారనేది పోలీసులు మానిటర్ చేయలేరని, ప్రతి ఇంటి దగ్గర గార్డు డ్యూటీ చేయలేరని వ్యాఖ్యానించారు. ‘‘ఇలాంటి ఘటనలు బిహార్, ఉత్తరప్రదేశ్, ఒడిశాలోనూ చాలా జరుగుతున్నాయి. యూపీలో బాధితులు కోర్టుకు వెళ్తుంటే నిప్పు పెట్టారు. ఒడిశాలో బీచ్‌ల దగ్గర అమ్మాయిలపై రేప్‌లు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రాల్లో ఏం చర్యలు తీసుకున్నారు?” అని ప్రశ్నించారు.
‘‘బెంగాల్‌లో ఇలాంటి ఘటనలను అసలు సహించం. ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేశాం. మిగతా వాళ్ల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఏ ఒక్కరినీ వదిలిపెట్టం” అని తెలిపారు. కాగా, సీఎం మమత కామెంట్లపై ప్రతిపక్ష నేతలు మండిపడ్డారు.
‘‘మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాల్సిందిపోయి.. అమ్మాయిలు అర్ధరాత్రి వేళల్లో బయటకు వెళ్లొద్దని ఒక మహిళా ముఖ్యమంత్రి చెప్పడం దారుణం. సీఎం సీటులో ఉండే అర్హత మమతకు లేదు. ఆమె వెంటనే రాజీనామా చేయాలి” అని బీజేపీ డిమాండ్ చేసింది.