ఈ ట్రాఫిక్ లో సచ్చేకంటే.. మెట్రోకు పోతాం : వాహనదారుల అభిప్రాయం

ఈ ట్రాఫిక్ లో సచ్చేకంటే.. మెట్రోకు పోతాం : వాహనదారుల అభిప్రాయం

ట్రాఫిక్.. ట్రాఫిక్.. ట్రాఫిక్.. రోడ్డెక్కితే నరకం. కారు అయినా.. బండి అయినా ఏది తీసినా.. ఎటు వెళ్లాలన్నా కనీసంలో కనీసం గంట నుంచి గంటన్నర సమయం పడుతుంది. ట్రాఫిక్ లేకపోతే 20 నిమిషాల్లో వెళ్లిపోతాం.. అదే ట్రాఫిక్ అయితే గంటన్నర పడుతుంది. వీక్ డేస్ అయినా.. వీకెండ్ అయినా రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ కష్టాలతో బెంగళూరు వాసులు విసిగిపోతున్నారు. ఈ క్రమంలో కార్లు, బైక్స్ గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకుంటున్నారు. చలో చలో మెట్రో జర్నీ అనే అభిప్రాయానికి ఫుల్ గా వచ్చేశారంట..

సెప్టెంబర్ 4న విడుదల చేసిన ఓ సర్వే నివేదిక ప్రకారం బెంగళూరు ద్విచక్ర వాహనదారులతో పోలిస్తే కారు వినియోగదారులు 1-1.5 గంటలు ట్రాఫిక్ లోనే గడుపుతున్నారు. బెంగళూరు పొలిటికల్ యాక్షన్ కమిటీ (B.PAC), WRI ఇండియాతో సహా NGOలు ప్రారంభించిన పర్సనల్2పబ్లిక్ ప్రచారంలో భాగంగా బెంగళూరులో 3వేల 855 మందితో ఈ సర్వే నిర్వహించారు. బెంగుళూరు పౌరులు వ్యక్తిగత వాహనాల నుంచి ప్రజా రవాణాకు కనీసం వారానికి రెండుసార్లు మారేలా ప్రోత్సహించడం ఈ ప్రచారం లక్ష్యం.

బెంగుళూరు మెట్రో వినియోగదారులు తమ ప్రధాన రవాణా విధానంలో 45 నిమిషాల కంటే తక్కువ సమయం కేటాయిస్తున్నారని నివేదిక కనుగొంది. అయితే మొదటి, చివరి మైలుతో కలిపి సగటు ప్రయాణ సమయం 1-1.5 గంటలు. కార్యాలయానికి వెళ్లేవారు కంపెనీ రవాణా ద్వారా ప్రయాణించేటప్పుడు ఎక్కువ సమయం వెచ్చిస్తారని కూడా ఇందులో వెల్లడైంది.

కారు వినియోగదారుల సగటు ట్రిప్ పొడవు 10 కిమీ అయితే, ఈ దూరాన్ని కవర్ చేయడానికి వెచ్చించే సమయం 1.5 గంటల కంటే ఎక్కువ. ఆసక్తికరమైన విషయమేమిటంటే, అత్యధిక సగటు ట్రిప్ పొడవు (13 కి.మీ) కలిగి ఉన్న మెట్రో ప్రయాణికులు తమ గమ్యాన్ని చేరుకోవడానికి తక్కువ సమయం తీసుకుంటుంది.