ఐటీ హబ్ బెంగళూరులో ఇల్లు దొరకడం ఒక ఎత్తైతే, దొరికిన ఇంట్లో ప్రశాంతంగా బతకడం మరో ఎత్తు. ఇటీవల కాలంలో కొంతమంది బెంగళూరు ఇంటి ఓనర్ల అరాచకాలు, అద్దెదారులను వేధించే ధోరణి హద్దులు దాటుతోంది. వేలకు వేలు అద్దె వసూలు చేస్తూనే చివరికి ప్రశాంతత లేకుండా చేస్తుండటం తరచుగా వార్తల్లో నిలుస్తోంది. బాధితులు ఏం చేయాలో తెలియక వారిని ఎదుర్కోలేక తమ పరిస్థితిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రజలను సలహాలు సూచనలు అడగటం చూస్తుంటే బెంగళూరు పరువు మెుత్తం రెంటల్ హోమ్ ఓనర్స్ గంగపాలు చేస్తున్నారు. వాళ్ల ప్రవర్తన చూస్తే ఇదేం అరాచకం సామీ అనక మానరు.
9 నెలల క్రితం ఒక యువకుడు రూ.40వేలు సెక్యూరిటీ డిపాజిట్ ఇచ్చి, నెలకు రూ.14వేల అద్దెకు ఒక ప్లాట్‌లోకి మారాడు. రూపాయి బాకీ లేకుండా ప్రతి నెలా కరెక్ట్ టైమ్‌కి రెంట్ కడుతున్నా.. గత కొన్ని నెలలుగా ఓనర్ ప్రవర్తన నరకంగా మారింది. చిన్న చిన్న విషయాలకే గొడవ పడటం, రూడ్ గా మాట్లాడటం ఎక్కువైంది. ఒకరోజు ఇంటికి గెస్టులు వచ్చిన సమయంలో ఓనర్ అరాచకం పీక్స్‌కు చేరింది. అందరి ముందూ నోటికొచ్చినట్టు తిడుతూ, ఘోరంగా అవమానించాడట ఓనర్. పబ్లిక్‌గా బెదిరింపులకు దిగాడు. వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని హుకుం జారీ చేశాడు.
డిపాజిట్‌లో కోత.. ఇదెక్కడి న్యాయం?
తనేమీ సొంతంగా ఇల్లు ఖాళీ చేయడం లేదు, ఓనరే మెసేజ్ చేసి వెళ్లిపోమంటున్నాడు. అయినా సరే డిపాజిట్ నుండి రూ.14వేలు కట్ చేసుకుంటానని ఓనర్ మొండికేస్తున్నాడట. దీనిపై సదరు టెనెంట్ ఆవేదన వ్యక్తం చేస్తూ.. వాళ్లే తనను బలవంతంగా వెళ్లగొడుతూ.. తన డిపాజిట్ డబ్బులు ఎలా కట్ చేస్తారు? అని నెటిజన్లను లీగల్ అడ్వైజ్ అడిగాడు.
ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు బెంగళూరు ఓనర్ల తీరుపై మండిపడుతున్నారు. బెంగళూరులో ఓనర్లకు డిపాజిట్ సొమ్ము కట్ చేసుకోవడం అలవాటుగా మారిందని, అగ్రిమెంట్‌లో క్లాజ్ ఉంటే తప్ప ఆ డబ్బులు వెనక్కి రావడం కష్టం అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు నువ్వు వెళ్లేటప్పుడు ఇల్లు మొత్తం వీడియో తీసి పెట్టుకో.. లేదంటే రూమ్ డ్యామేజ్ అయిందని మరికొంత డబ్బు నొక్కేస్తారంటూ మరొక యూజర్ హెచ్చరించారు.
ప్రస్తుతం బాధితుడు ఓనర్ పంపిన మెసేజ్ స్క్రీన్‌షాట్లు, గెస్టుల సాక్ష్యాలు, రెంట్ పేమెంట్ రికార్డులతో లీగల్ నోటీస్ సిద్ధం చేసుకున్నాడు. కోర్టు ద్వారా అయినా సరే తన పూర్తి డిపాజిట్ రూ.40వేలు వెనక్కి తెచ్చుకోవాలని చూస్తున్నాడు. టైమ్‌కి రెంట్ కట్టినా గౌరవం ఇవ్వకుండా.. సెక్యూరిటీ డిపాజిట్ డబ్బుల కోసం కక్కుర్తి పడే ఇలాంటి ఓనర్ల అరాచకాలకు చెక్ పడాల్సిందే అంటూ నెటిజన్లు కూడా అతనికి అండగా నిలుస్తున్నారు.
