V6 News

ప్రేమ పెళ్లిళ్లపై పూజారుల సీరియస్ నిర్ణయం.. ఎక్కడ? ఎందుకో తెలుసా..?

ప్రేమ పెళ్లిళ్లపై పూజారుల సీరియస్ నిర్ణయం.. ఎక్కడ? ఎందుకో తెలుసా..?

ఈ రోజుల్లో ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లిళ్లు పెటాకులు అవ్వటం కూడా అంతే స్పీడుగా జరిగిపోతోంది. దీంతో ప్రేమ పెళ్లిళ్లను బ్యాన్ చేసింది బెంగళూరులోని ఒక దేవాలయం. భారత సంస్కృతిలో పెళ్లికి ఉన్న ప్రాధాన్యత, దాని విలువలు మసకబారుతున్న వేళ అక్కడి పూజారులు కూడా ప్రేమ పెళ్లిళ్లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే పండితులు ప్రేమ పెళ్లిళ్లు చేయబోం అనటానికి దారితీసిన పరిస్థితుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

పెళ్లిళ్లు చేసిన తర్వాత సదరు దంపతుల విడాకుల కేసుల్లో కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్న భయంతో బెంగళూరులోని శతాబ్దాల చరిత్ర కలిగిన ప్రసిద్ధ హలసూరు సోమేశ్వర ఆలయంలోని పండితులు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై తమ ఆవరణలో ఎవరికీ వివాహాలు జరిపించకూడదని నిర్ణయించారు. ఇలా ప్రేమ పెళ్లిళ్లు కొన్నాళ్లకే విడాకులకు దారితీయటం వల్ల ఆలయానికి చెడ్డపేరు వస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఈ దేవాలయం చాలా కాలంగా వివాహాలకు ప్రసిద్ధి చెందింది. అయితే ఇటీవల ఒక వ్యక్తి తన వివాహానికి నిరాకరించారని కర్ణాటక ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వార్తల్లోకి ఎక్కింది. 

ఈ వ్యవహారంపై సీఎంఓ వివరణ కోరగా.. ఆలయ పూజారులు, కమిటీ అధికారులు తమ నిర్ణయం వెనుక గల అసలు కారణాన్ని వెల్లడించారు. పెళ్లి చేసుకున్న దంపతులు విడాకుల కేసుల్లో కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం రాకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. గత కొన్నేళ్లుగా ఆలయ ప్రాంగణంలో వివాహం చేసుకుని, ఆ తర్వాత విడిపోయే క్రమంలో ధ్రువీకరణ కోసం ఆలయాన్ని ఆశ్రయిస్తున్న జంటల సంఖ్య భారీగా పెరిగిందని ఆలయ నిర్వహణ తెలిపింది. విడాకుల ప్రక్రియల సమయంలో కోర్టులు తరచుగా ఆలయ పూజారులను హాజరుకావాలని ఆదేశిస్తున్నాయని.. దీంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు. 

చాలా మంది ప్రేమ జంటలు ఇళ్ల నుంచి పారిపోయి వచ్చి.. నకిలీ పత్రాలతో పెళ్లి చేసుకుంటున్నారని ఆలయ ముఖ్య పరిపాలనా అధికారి వి. గోవిందరాజు చెప్పారు. కొద్ది రోజుల తర్వాత వారి తల్లిదండ్రులు వచ్చి గొడవ చేయడం, కొన్ని సందర్భాల్లో కోర్టు కేసులు పెట్టడం జరుగుతోందని అన్నారు. ఇది ఆలయ ప్రతిష్టతో పాటు అక్కడి సిబ్బంది, పూజారులకు కూడా ఇబ్బందికరంగా మారిందని పేర్కొన్నారు. అందుకే కర్ణాటక ప్రభుత్వ హిందూ ధార్మిక సంస్థల శాఖ పరిధిలోకి వచ్చే ఈ ఆలయ ప్రతిష్టకు భంగం కలగకుండా ఉండటానికి.. సుమారు 6-7 సంవత్సరాల క్రితమే పెళ్లిళ్లను ఆపేశామని, అంతకుముందు 100 నుంచి 150 వివాహాలు జరిగేవని వారు వివరించారు. 

అయితే దీనిపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పెళ్లి సర్టిఫికేట్‌ను స్థానిక సంస్థ ఇస్తుంది, పూజారులు విడాకుల కేసులకు ఎందుకు హాజరు కావాలి? ఇది వేరే ఎక్కడా వినలేదంటూ ఒక నెటిజన్ కామెంట్ చేశారు. మరొకరు ఆలయం అనేది పవిత్ర స్థలమని. కేవలం భక్తుల కోసం దానిని 'కల్యాణ మండపం'గా మార్చకూడదన్నారు. రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రీ వివాహం చేసుకుని, ఆశీర్వాదం కోసం గుడికి రావాలని సూచించారు.