గోవా క్యాసినోలో రూ.25 లక్షలు గెలిచిన చాయ్ వాలా.. ఆ తర్వాత ఊహించని కష్టం

గోవా క్యాసినోలో రూ.25 లక్షలు గెలిచిన చాయ్ వాలా.. ఆ తర్వాత ఊహించని కష్టం

అదృష్టం అంటే చాయ్ వాలాదే. సరదాగా క్యాసినో ఆడాడు. అదృష్టం కలిసి వచ్చి ఏకంగా రూ. 25 లక్షలు గెలిచాడు. కానీ రూ. 25 లక్షలు గెలిచిన ఆనందం అతనికి ఎక్కువ సేపు నిలవలేదు. వివరాల్లోకి వెళ్తే..

బెంగుళూరు సిటీలో త్యాగరాజన్ నగర్ కు చెందిన తిలక్ ఎం మణికంఠ..రోడ్డు పక్కనే టీ అమ్ముకుంటున్నాడు. అయితే అతను జులై 30వ తేదీన స్నేహితులతో కలిసి గోవా వెళ్లాడు. తనతో పాటు రూ. 4 లక్షలు తీసుకెళ్లాడు. అయితే అక్కడ ఆగస్టు 1వ తేదీన పనాజీలోని మెజెస్టిక్ ప్రైడ్ క్యాసినోలో  క్యాసినో ఆడాడు.  మనోడిని అదృష్టం వరించింది. మణికంఠ ఏకంగా రూ. 25 లక్షలు గెలుచుకున్నాడు. అయితే ఈ విషయాన్ని తన స్నేహితులకు చెప్పలేదు. తాను గెలుచుకున్న నగదును అతని బ్యాంకు అకౌంట్ కు బదిలీ చేసుకున్నాడు. 

బెంగుళూరులో కిడ్నాప్..

ఆగస్టు 5వ తేదీన మణికంఠ స్నేహితులతో కలిసి బెంగుళూరుకు తిరిగివచ్చాడు. ఆగస్టు 6వ తేదీ మణికంఠ ఓ దుకాణం దగ్గర నిలబడి ఉండగా..అతని స్నేహితులు కార్తీక్, పాండు, ఈశ్వర్, నిశ్చల్ మణికంఠ దగ్గరకు వచ్చారు. అతన్ని బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. బెంగుళూరు యూనివర్సిటీలోని ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి మణికంఠ మొబైల్ బ్యాకింగ్ ద్వారా అతని ఖాతా నుంచి రూ. 15 లక్షలను వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసుకున్నారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇస్తే బాగుండదని హెచ్చరించి నెలమంగళలోని రిసార్ట్ గదిలో వదిలేశాడు. అక్కడి నుంచి ఆగస్టు 6వ తేదీన మణికంఠ తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు మణికంఠ స్నేహితులపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు పరారీలో ఉన్నారని..వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.