రూ.3 లక్షలు అప్పు చేసి.. రోడ్లపై గుంతలు పూడ్చుతున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్

రూ.3 లక్షలు అప్పు చేసి.. రోడ్లపై గుంతలు పూడ్చుతున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్

రోడ్డెక్కితే గుంతలు.. ఎక్కడ గొయ్యి ఉంటుందో.. ఎక్కడ పడిపోతామో అనే భయం.. బండి ఎక్కితే చాలు పరేషాన్. ఎన్నిసార్లు విషయాన్ని అధికారులకు చెప్పినా పట్టించుకోవటం లేదు.. ప్రజాప్రతినిధులు పత్తాలేరు.. దీంతో విసిగిపోయిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. తన జీతం నుంచి రెండు లక్షల 70 వేల రూపాయలను.. బ్యాంక్ నుంచి అప్పు తీసుకున్నాడు. ఈ డబ్బులను రోడ్లపై గుంతలను పూడ్చటానికి ఉపయోగిస్తున్నాడు. ప్రపంచంలోనే ఫస్ట్ టైం ఇలాంటి ఘటన మన దేశంలోని.. బెంగళూరు సిటీలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బెంగళూరుకు చెందిన 32 ఏళ్ల ముద్గల్.. కర్నాటక రాష్ట్రం బెంగళూరు సిటీలోని హోసా రోడ్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. తాను ఉండే ప్రాంతంలో రోడ్డు అధ్వాన్నంగా ఉంది. రోడ్డుపై గుంతలతో ఇటీవల ఓ డెలివరీ బాయ్ బ్యాలెన్స్ తప్పి.. తన కారును ఢీకొన్నాడు. యాక్సిడెంట్ లో అతను తీవ్రంగా గాయపడ్డాడు. అతని కుటుంబానికి ఆ డెలివరీ బాయ్ సంపాదనే ఆధారం.. మరో ఘటనలో.. గుంతల వల్ల ఓ ఆటో బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అయినా ప్రభుత్వం స్పందించలేదు.. రోడ్డు బాగు చేయలేదు. 

ఈ క్రమంలోనే నో డెవలప్ మెంట్ నో ట్యాక్స్ పేరుతో.. తన స్నేహితులతో కలిసి ఉద్యమం ప్రారంభించాడు. హోసా ప్రాంతంలోని రోడ్లను బాగుచేయటానికి నిధులు సమీకరించారు. అయితే అవి సరిపోలేదు. దీంతో తాను పని చేస్తున్న ఐటీ కంపెనీ జీతం నుంచి 2 లక్షల 70 వేల రూపాయల అప్పు తీసుకున్నాడు. ఈ మొత్తాన్ని రోడ్లు బాగు చేయటానికి ఉపయోగిస్తున్నాడు ముద్గల్. తనతోపాటు తాము ఉండే ప్రాంతంలోని మిగతా వారి సాయం తీసుకుంటూ.. సొంత నిధులతో రోడ్లు బాగు చేసుకుంటున్నారు స్థానికులు. 

పన్నులు కడుతున్నా కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేని ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నాడు ముద్గల్. వసతులు కల్పించనప్పుడు పన్నులు ఎందుకు కట్టాలని ప్రశ్నిస్తున్నాడు. గుంతల రోడ్లలో ప్రయాణించే ఎంత మంది వాహనదారులు ప్రమాదాలకు గురయ్యి.. విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని.. వాళ్ల కుటుంబాలు అనాధులుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే సొంతంగా రోడ్లు బాగు చేయటానికి రంగంలోకి దిగినట్లు చెబుతున్నాడు ముద్గల్.  చందాలు వసూలు చేసినా.. సరిపోక పోవటంతో బ్యాంక్ లోన్ తీసుకుని రోడ్లకు మరమ్మతులు చేస్తున్నట్లు చెప్పాడు. ప్రపంచంలో ఇలాంటి తరహా ఘటన ఇదే కావొచ్చు అంటున్నారు నెటిజన్లు.

ప్రభుత్వాల పనితీరు.. అధికారుల నిర్లక్ష్యం.. జవాబుతారీ తనం లేదని ప్రజాప్రతినిధులు ఉన్నంత కాలంలో రోడ్లు బాగుపడతాయంటే కష్టమే అంటున్నారు నెటిజన్లు. ఇప్పటికైనా ప్రభుత్వాలు కళ్లు తెరిచి.. వసూలు చేస్తున్న పన్నుల నుంచి కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తే.. ఎన్నో ప్రాణాలు నిలబెట్టినోళ్లు అవుతారు..