
Bengaluru Traffic: బెంగళూరు ట్రాఫిక్ కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. నగరంలో గ్లిడ్ లాక్స్, గంటల తరబడి ప్రయాణం, రోడ్లపై అర్థరాత్రులు కూడా రద్దీ ఐటీ నగరాన్ని వేదిస్తున్న ప్రధాన సమస్య. చాలా మంది బెంగళూరు నుంచి ఇతర మెట్రో నగరాలకు తమ ఉద్యోగాలను మార్చుకోవటానికి కూడా ఇదొక పెద్ద ట్రిగర్ పాయింట్ అవుతోంది.
ప్రధానంగా బెంగళూరులోని ఓఆర్ఆర్ ప్రాంతం రద్దీగా మారటం ట్రాఫిక్ కష్టాలను పెంచుతోంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. వారం మధ్యలో అంటే బుధవారం రోజున నగరంలోని అన్ని కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ సౌకర్యాన్ని తీసుకురావాలని నిర్ణయించారు. దీనికి తోడు కంపెనీల్లో అస్థిరమైన వర్కింగ్ సమయాలు, కంపెనీ రవాణా సౌకర్యం ద్వారా నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులను తగ్గించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు.
బెంగళూరు నగరంలో పీక్ అవర్స్ లో ట్రాఫిక్ సమాన్య ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. చిన్న చిన్న దూరాలకు కూడా గంటల సమయం ట్రాఫిక్ లోనే ఉండాల్సి రావటంతో నిరాశకు గురవుతున్నారు. ఒక యూజర్ ట్రాఫిక్ కష్టాలను ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. తాను ఆఫీసుకు ఉదయం 9 గంటల నుంచి 9.30లోపు స్టార్ట్ అయ్యి కేవలం 6 కిలోమీటర్లు ప్రయాణించటానికి మధ్యాహ్నం 12 అవుతోందని చెప్పుకొచ్చారు. ఇంత ట్రాఫిక్ లో ఒత్తిడిలో డ్రైవింగ్ చేయటం కష్టంగా మారటంతో క్యాబ్ బుక్ చేసుకుంటున్నట్లు చెప్పారు. ఆరు కిలోమీటర్లకు రూ.600 వరకు చార్జ్ ఉంటోందని చెప్పారు.
ఆఫీసుకు రెండు కిలోమీటర్ల లోపు దూరంలో ఉన్న తన సహ ఉద్యోగులు క్యాప్ కోసం కాల్ చేయటం కంటే నడిచి వెళ్లేందుకు ఇష్టపడుతున్నారని చెప్పుకొచ్చారు సదరు యూజర్. ప్రస్తుతం ట్రాఫిక్ కష్టాలను తగ్గించేందుకు వర్క్ ఫ్రం హోమ్ ఆలోచనతో రావటం నగరంలో రవాణాను వేగవంతం చేయటంతో పాటు ఉత్పాదకతను పెంచుతుందని అధికారులు భావిస్తున్నారు.
ప్రతి రోజు ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ట్రాఫిక్ హెవీగా ఉంటోందని ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ కార్తీక్ రెడ్డి చెబుతున్నారు. అందువల్ల నగరంలోని కంపెనీలు తమ పని వేళలను ఉదయం 7.30 గంటల నుంచి వర్కింగ్ ఆవర్స్ స్టార్ట్ చేయాలని సూచించారు. దీనిపై బస్సు ట్రాన్స్ పోర్ట్ అధికారులతో పాటు నగరంలోని ఐటీ కంపెనీల ప్రతినిధులతో ట్రాఫిక్ అధికారులు మాట్లాడినట్లు కార్తీక్ రెడ్డి చెప్పారు. పెండింగ్ రోడ్ల పనులు వేగవంతం చేయటంతో పాటు ఐటీ పార్కుల మధ్య కనెక్టివిటీని మెరుగుపరచాలని సమావేశంలో చర్చించారు.
ALSO READ : Gold Rate: శనివారం చల్లారిన గోల్డ్ & సిల్వర్.. పెళ్లిళ్ల షాపింగ్ స్టార్ట్, హైదరాబాదులో రేట్లిలా..
ఈ క్రమంలో టెక్కీల రవాణా కోసం ఏసీ బస్సులను తీసుకురావటానికి బీఎంటీసీ ఓకే చెప్పగా.. ప్రైవేట్ కంపెనీలు షటిల్ సర్వీసులను నిర్వహించాలని కోరారు జాయింట్ కమిషనర్. అలాగే నగరంలో జరుగుతున్న పార్కింగ్ ఉల్లంఘనలు ట్రాఫిక్ కష్టాలను మరింతగా పెంచుతున్నట్లు అధికారులు దృష్టి సారిస్తున్నారు. బెంగళూరు టెక్ కారిడార్లలో ట్రాఫిక్ ఇప్పుడు భరించలేని స్థాయిలకు చేరుకుందని ఐటీ అండ్ కంపెనీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ కుమార్ గౌడ అన్నారు. మార్పుల అమలుకు సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.