మీరు మా అందరి కంటే అందంగా ఉన్నారు.. అందుకే ఉద్యోగం ఇవ్వటం లేదు

మీరు మా అందరి కంటే అందంగా ఉన్నారు.. అందుకే ఉద్యోగం ఇవ్వటం లేదు

చాలా మందికి అనేక కారణాల వల్ల ఉద్యోగం రాదు. కొన్ని కంపెనీలు.. అభ్యర్థికి మార్కులు తక్కువ ఉన్నాయని రిజెక్ట్ చేస్తే.. మరికొందరేమో వారు చెప్పే లేదా వారి ప్రవర్తనను చూసి తిరస్కరించడం చూస్తూనే ఉంటాం. కానీ ఇటీవల వైరల్ అవుతోన్న ఓ సంఘటన మాత్రం మరీ విచిత్రంగా తోస్తోంది. అసలు ఈ కారణం వల్ల కూడా జాబ్ కు తీసుకోరా అనిపిస్తుంది. ఇంతకీ అభ్యర్థిని తీసుకోకపోవడానికి కంపెనీ చెప్పిన కారణం ఏంటో తెలుసా.. అందంగా ఉండడం. అవును. మీరు వింటున్నది నిజమే.. వివరాల్లోకి వెళితే..

ఓ మహిళ అందంగా ఉందన్న కారణంగా కంపెనీ ఆమెను రిజెక్ట్ చేసిందని లింక్డ్‌ఇన్ ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. దీన్ని బెంగుళూరుకు చెందిన రిక్రూట్‌మెంట్ ప్రొఫెషనల్ ప్రతీక్ష జిచ్కర్ పోస్ట్ చేశారు. "నా స్కిన్ టోన్ అక్కడున్న బృంద సభ్యుల కంటే బాగా ఉండడంతో చివరి రౌండ్ ఇంటర్వ్యూలో నేను తిరస్కరించబడ్డాను" అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఒక కంపెనీ నుంచి తనకు వచ్చిన తిరస్కరణ ఇమెయిల్ స్క్రీన్‌షాట్‌ను షేర్ చేసిన ఆమె.. “మీరు సరిగ్గా చదివారు, 3 రౌండ్ల ఇంటర్వ్యూ, 1 రౌండ్ అసైన్‌మెంట్ తర్వాత, అన్ని సంబంధిత నైపుణ్యాలు, అర్హతలు,అనుభవం ఉన్నా నేను ఈ ఉద్యోగానికి సరిపోను. ఎందుకంటే ప్రస్తుత టీమ్ కంటే నా స్కిన్ టోన్ ఫెయిర్‌గా ఉండడమే అంటూ ఆమె లింక్డ్ ఇన్ లో రాసుకువచ్చారు.

కంపెనీ పేరును వెల్లడించని ఈ స్క్రీన్‌షార్ట్ ని పరిశీలిస్తే.. “హాయ్ ప్రతీక్షా, మాతో ఇంటర్వ్యూ చేసినందుకు, ప్రక్రియ అంతా ఓపికగా ఉన్నందుకు ధన్యవాదాలు. దురదృష్టవశాత్తూ, ఈ సమయంలో మేము మీతో ముందుకు వెళ్లలేము. మీ ప్రొఫైల్ సంబంధితంగా ఉన్నట్లు మేము కనుగొన్నాము. అన్ని నైపుణ్యాలు, అర్హతలు మేము వెతుకుతున్న దానితో సరిపోలుతున్నాయి. అయితే ప్రస్తుత టీమ్‌ కంటే మీ స్కిన్ టోన్ చాలా ఫెయిర్ గా ఉంది కాబట్టి మా బృందంలో మీకు ఆఫర్ చేయకూడదని మేము నిర్ణయించుకున్నాము” అని ఇమెయిల్ లో ఉంది. ఇది యూజర్స్ ను విపరీతంగా షాక్ చేస్తోంది. నెటిజన్లు ఈ పోస్టుపై పలు రకాలుగా కామెంట్లు చేస్తుండగా.. “ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమే. ఇది నిజం కాదు”అని ఒక యూజర్ రాసుకువచ్చారు.