
టెల్ అవీవ్: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్‌లో భారత్ ఇజ్రాయెల్ ఆయుధాలను ఉపయోగించిందని ఆయన అన్నారు. ఇజ్రాయెల్ భారత్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన బరాక్-8 క్షిపణులు, హార్పీ డ్రోన్‌లు ఉపయోగించారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో అవి చాలా బాగా పని చేశాయని పేర్కొన్నారు. దాదాపు 100 గంటల పాటు పాకిస్థాన్ డ్రోన్లు, మిస్సైళ్ల దాడులను బరాక్-8 క్షిపణులు, హార్పీ డ్రోన్‌లతో భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టిందని తెలిపారు.
కాగా.. 2025, ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో 26 మంది చనిపోయారు. ఈ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్థాన్ తో పాటు పీవోకేలోని ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సిందూర్ కు వ్యతిరేకంగా పాక్ ఆర్మీ భారత్ పై దాడులకు దిగింది. మిస్సైళ్లు, డ్రోన్లతో ఇండియాపై దాడులకు ప్రయత్నించింది. పాక్ దాడులను భారత్ సమర్ధవంతంగా తిప్పికొట్టింది. ఇజ్రాయెల్ బరాక్ క్షిపణులు, హార్పీ డ్రోన్‌లు, S-400 క్షిపణి రక్షణ వ్యవస్థతో పాక్ దాడులను ఎక్కడికక్కడే అణిచివేసింది.