కొత్త కుబేరుడు బెర్నార్డ్ అర్నాల్ట్

కొత్త కుబేరుడు బెర్నార్డ్ అర్నాల్ట్

ప్రపంచంలో కొత్త కుబేరుడు అవతరించాడు. యూరప్‌‌‌‌లో అత్యంత ధనికవంతుడు బెర్నార్డ్ అర్నాల్ట్, జెఫ్ బెజోస్, బిల్‌‌‌‌గేట్స్‌‌‌‌ల క్లబ్‌‌‌‌లో చేరిపోయారు. 100 బిలియన్ డాలర్లకు పైగా( రూ.6,96,789 కోట్ల) సంపదతో బెర్నార్డ్ ఈ కుబేరుల లిస్ట్‌‌‌‌లోకి వచ్చారు. ప్రపంచంలో  100 బిలియన్ డాలర్లకు పైన సంపద వున్నవాళ్లు ఈ ముగ్గురే. ఎల్‌‌‌‌వీఎంహెచ్‌‌‌‌కు బెర్నార్డ్ ఛైర్మన్. ఈ ఫ్రెంచ్ మల్టినేషనల్ లగ్జరీ గూడ్స్ కంపెనీ  షేరు మంగళవారం నాడు 2.90 శాతం పెరిగి రికార్డు స్థాయిలో 368.80 యూరోలుగా నమోదైంది. దీంతో ఈయన సంపద కూడా బాగా పెరిగింది. ఈ ఏడాదిలోనే బెర్నార్డ్ సంపద సుమారు 32 బిలియన్ డాలర్లు పెరిగింది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 2,22,983 కోట్లు.

2019 బ్లూమ్‌‌‌‌బర్గ్ ర్యాంకింగ్స్‌‌‌‌లో యూరోపియన్‌‌‌‌ మెంబర్స్‌‌‌‌లో ఫ్రాన్స్ మల్టిబిలీనియర్స్ తమ సంపదను అత్యధికంగా పెంచుకున్నారు. బెర్నార్డ్ ప్రస్తుత సంపద ప్రస్తుత ఫ్రాన్స్ ఎకానమీలో 3 శాతానికి సమానంగా ఉంది. అయితే అత్యధిక ప్రయోజనాలు ధనికులకే వెళ్తున్నాయని ఈ ఏడాది ఫ్రాన్స్‌‌‌‌లో ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. పారిస్‌‌‌‌కు చెందిన ఎల్‌‌‌‌వీఎంహెచ్‌‌‌‌లో బెర్నార్డ్ సగానికి పైగా వాటాలను తన ఆధీనంలోనే ఉంచుకున్నారు. లగ్జరీ గూడ్స్‌‌‌‌ కంపెనీ క్రిస్టియన్ డియోర్‌‌‌‌‌‌‌‌లో 97 శాతం వాటాలు ఈయనే వద్దే ఉన్నాయి. క్రిస్టియన్ డియోర్‌‌‌‌‌‌‌‌ను బెర్నార్డ్ పుట్టడానికి కంటే మూడేళ్ల ముందు 1949లో ప్రారంభించారు. క్రిస్టియన్ డియోర్‌‌‌‌‌‌‌‌కు చెందిన టెక్స్‌‌‌‌టైల్ గ్రూప్‌‌‌‌ను కొనుగోలు చేసిన బెర్నార్డ్ లగ్జరీ గూడ్స్ మార్కెట్ లోకి ప్రవేశించారు. 1988లో ఎల్‌‌‌‌వీఎంహెచ్‌‌‌‌లో మెజార్టీ వాటాలను సొంతం చేసుకోవడానికి ఇతర వ్యాపారాలను చాలా వాటిని బెర్నార్డ్‌‌‌‌ అమ్మేశారు. బెర్నార్డ్ సంపద ఈ మేర పెరిగితే, ప్రపంచ కుబేరుడు అమెజాన్.కామ్ ఇంక్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, తన భార్య నుంచి విడాకులు తీసుకునే క్రమంలో 40 బిలియన్ డాలర్ల సంపదను వదిలేసుకున్నారు. మరో కుబేరుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌‌‌‌గేట్స్‌‌‌‌ 35 బిలియన్ డాలర్లకు పైగా బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌‌‌‌కు విరాళంగా ఇచ్చారు.